Asianet News TeluguAsianet News Telugu

ఆర్టిసి బస్ డ్రైవర్లుగా 320మంది మహిళలు...: మంత్రి నాగార్జున ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్ లో 320మంది మహిళలకు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చి ఏపీఎస్ ఆర్టిసి లో డ్రైవర్లుగా నియామకమయ్యేలా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి మేరుగ నాగార్జున ప్రకటించారు. 

320 SC Womens Chance to Appoint RTC  Bus Drivers... minister meruga nagarjuna
Author
Amaravati, First Published May 18, 2022, 5:05 PM IST

అమరావతి: ఎస్సీ మహిళలకు ఆర్టీసీలో బస్సు డ్రైవర్లుగా నియమించడానికి అవసరమైన హెవీ వెహికల్ డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున (meruga nagarjuna) వెల్లడించారు. శిక్షణానంతరం దాదాపు 320 మహిళలు బస్సు డ్రైవర్లుగా ఉద్యోగాలను పొందే అవకాశం ఉందని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది రూ.136 కోట్లతో ఇన్ కం జనరేషన్, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలను చేపట్టనున్నామని మంత్రి చెప్పారు.

రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న పథకాలను బుధవారం సచివాలయంలో మంత్రి నాగార్జున సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పిఎం అజయ్ పథకం కింద ఈ ఏడాది రూ.136 కోట్లతో పలు కార్యక్రమాలను చేపట్టనున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగానే ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఇన్ కం జనరేషన్ కార్యక్రమాలను చేపడతామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో భాగంగా పలు వృత్తి విద్యలలో శిక్షణలు ఇస్తామని, ఈ శిక్షణ పొందిన వారికి తప్పనిసరిగా ఉద్యోగాలు లభించేలా చూస్తామని మంత్రి తెలిపారు. 

స్కిల్ డెవలప్ మెంట్ లో భాగంగానే ఎస్సీ మహిళలకు భారీ వాహనాల డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. హెవీ వెహికల్ డ్రైవర్లుగా శిక్షణ పొందిన మహిళలు ఆర్టీసీలో బస్సు డ్రైవర్లుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేసిన 320 డ్రైవర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని... అవన్నీ కూడా శిక్షణానంతరం ఎస్సీ మహిళలకు వచ్చేలా చూస్తామని మేరుగు నాగార్జున వివరించారు. 

డ్రైవింగ్ తో పాటుగా కార్పొరేట్ ఆస్పత్రుల ద్వారా మహిళలకు నర్సింగ్ లోనూ శిక్షణలు ఇస్తామని తెలిపారు. పిఎం అజయ్ పథకంలో భాగంగానే  ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భూములలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపడతామని మంత్రి వివరించారు. 

ఎన్.ఎస్.ఎఫ్.డీ.సీ, ఎన్.ఎస్.కే.ఎఫ్.డీ.సీ, భూమి కొనుగోలు  (ఎల్పీఎస్) తదితర పథకాలకు సంబంధించిన ప్రగతిని ఈ సందర్భంగా మంత్రి నాగార్జున సమగ్రంగా సమీక్షించారు. కాగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించి 17 ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయని గుర్తించడం జరిగిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ భూములు ఎక్కడా అన్యాక్రాంతం కాకుండా వాటిని సర్వే చేసి సరిహద్దులు గుర్తించి, కంచె వేయడంతో పాటు అవి ఎస్సీ కార్పొరేషన్ భూములనే విషయాన్ని తెలియజేసే విధంగా బోర్డులను కూడా పాతాలని అధికారులను నాగార్జున ఆదేశించారు. 

కేవలం ఖాళీ భూములు కాకుండా గతంలో కోళ్ల పెంపకం కోసం లబ్దిదారులకు లీజు కింద ఇచ్చిన భూములు కూడా ఉన్నాయని వాటన్నింటిని కూడా ఉపయోగంలోకి తీసుకురావడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1407 పౌల్ట్రీ షెడ్ల కోసం సుమారు 594 ఎకరాల భూములను కేటాయించడం జరిగిందని... ప్రస్తుతం ఈ షెడ్లలో 1245 దాకా నిరుపయోగంగా ఉన్నాయని అధికారులు గుర్తించడం జరిగిందని నాగార్జున వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios