చిత్తూరు జిల్లాలో విషాదం: విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి
చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లి మండలం పెద్దకొండమర్రిలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందారు
చిత్తూరు: జిల్లాలోని చౌడేపల్లి మండలం పెద్దకొండమర్రిలో విద్యుత్ షాక్ తో శుక్రవారంనాడు ముగురు మృతి చెందారు. నీటి సంపు శుభ్రం చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నీటి సంప్ ను శుభ్రం చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్ నీటిలో పడడంతో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్టుగా స్థానికులు చెబుతున్నారు.
గతంలో కూడ రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ షాక్ తో పలువురు మరణించారు.ఈ నెల 11న తెలంగాణలోని మహబూబాబాద్ లో విద్యుత్ షాక్ తో మరికొద్ది గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు మృతి చెందాడు. బోర్ రిపేరు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఏడాది ఏప్రిల్ 14న అన్నమయ్య జిల్లాలో గృహ ప్రవేశం సమయంలో విద్యుత్ షాక్ తో నలుగురు మృతి చెందారు.మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
కడప జిల్లా చెన్నూరు మండలంఖాదర్ ఖాన్ కొట్టాలలో ఈ ఏడాది ఫిబ్రవరి 23న జరిగిన విద్యుత్ షాక్ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. రేకుల షెడ్డుపై ఎక్కిన ఇద్దరు చిన్నారులు పొరపాటున మెయిన్ విద్యుత్ వైరును పట్టుకోవడంతో విద్యుత్ షాక్ కు గురయ్యారు.
పల్నాడు జిల్లాలో విద్యుత్ షాక్ తో తల్లీ కొడుకు మృతి చెందిన ఘటన గత ఏడాది నవంబర్ 22న జరిగింది. జిల్లాలోని కారంపూడి ఇందిరానగర్ లో ఇంట్లోని ఇనుప తీగపై బట్టలు ఆరవేస్తున్న తల్లి విద్యుత్ షాక్ కు గురైంది. ఆమెను కాపాడే క్రమంలో కొడుకు కూడ విద్యుత్ షాక్ కు గురయ్యాడు.