ఏపీలో కరోనా వ్యాప్తి: కొత్తగా 264 పాజిటివ్ కేసులు, మరో ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోరనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 264 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనాతో మరో ఇద్దరు మరణించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు కాస్తా తక్కువగా కేసులు నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో 264 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందినవారిలో 193 మందికి గత 24 గంటల్లో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
గత 24 గంటల్లో మరో ఇద్దరు మరణించారు. చిత్తూరు జిల్లాలో ఒకరు, ప్రకాశం జిల్లాలో మరొకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 88కి చేరింది. గత 24 గంటల్లో 15,911 శాంపిల్స్ ను పరీక్షించగా 193 మందికి పాజిటివ్ సోకినట్లు తేలింది. వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 44 మంది ఉండగా, విదేశాల నుంచి వచ్చినవారు 27 మంది ఉన్నారు.
గత 24 గంటల్లో 81 మంది కోవిడ్ -19 నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో 5280 కేసులు నమోదు కాగా, అందులో 2851 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 2341 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
విదేశాల నుంచి వచ్చినవారిలో 237 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో 214 యాక్టివ్ కేసులున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 1203 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 47 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 564 యాక్టివ్ కేసులున్నాయి.