అమరావతి:  కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని  ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.  థర్డ్ వేవ్ లో పిల్లలకు కరోనా వస్తుందని నిర్ధారణ లేదని అయినా కూడ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.కరోనా కేసులు, బ్లాక్ ఫంగస్ కేసులపై ఏపీ హైకోర్టులో గురువారం నాడు విచారణ నిర్వహించింది.కరోనా నివారణ చర్యల కోసం 26,325 మంది సిబ్బందిని నియమించినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

పీజీ మెడికల్ విద్యార్థుల సేవలకు భవిష్యత్తులో వెయిటేజీ ఇస్తామని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 1955 బ్లాక్ ఫంగస్ కేసులు, 109 మరణాలు  నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 1300 బ్లాక్ ఫంగస్  కేసులు యాక్టివ్ గా ఉన్నట్టుగా ప్రకటించింది. వృద్దులకు ఆధార్ కార్డు లేకుండానే వ్యాక్సిన్ వేసేందుకు నిర్ణయం తీసుకొన్నామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కరోనా టెస్టులను వేగవంతం చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. 

కాంట్రాక్టు నర్సుల బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. రెడిడెసివర్ ఇంజక్షన్లపై డీసీఐ ఇచ్చిన నివేదికను ప్రభుత్వ లాయర్ హైకోర్టుకు తెలిపారు. 
కరోనా నియంత్రణ చర్యలపై  విచారణను సోమవారం నాటికి హైకోర్టు వాయిదా వేసింది.