గుంటూరు: కరోనా వైరస్ పట్ల ప్రపంచమంతా అప్రమత్తంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందని టిడిపి ఎపీ అధ్యక్షులు కళా వెంకట్రావు మండిపడ్డారు. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటనలు ఇస్తూనే మరో వైపు ఎక్కడికక్కడ చేతులెత్తేస్తున్నారని ఆరోపించారు. వాస్తవాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తూ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నిస్తోందని కళా వెంకట్రావు మండిపడ్డారు. 

''ముఖ్యమంత్రి, మంత్రుల నిర్లక్ష్యంతో కరోనా పాజిటివ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. రికవరి రేటులో ఉత్తరాఖండ్ వంటి మిగతా రాష్ట్రాల కన్నా ఏపీ వెనుకబడింది. 10 లక్షల టెస్టులు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ వాటిలో ఖచ్చితత్వం ఎంతో ప్రజలకు చెప్పాలి? కరోనా టెస్టుల నిర్వహణలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 3 లక్షలకు పైగా శాంపిల్స్ వృధా కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది'' అని  అన్నారు. 

''కరోనా లక్షణాలున్న ప్రతి వ్యక్తికి పరీక్షలు నిర్వహిస్తామన్న హామీ నెరవేరడం లేదు. రాజధాని వికేంద్రీరణపై ముఖ్యమంత్రికి ఉన్న శ్రద్ద కరోనా నివారణపై లేదు. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించడం, ఐసియు బెడ్ల సంఖ్య పెంచుకోవడం, ఆక్సిజన్ ఏర్పాట్లు, వెంటిలేటర్లు తెప్పించడం ఇటువంటి అత్యవసర అంశాలపై ఎందుకు చర్చించలేదు?'' అని ప్రశ్నించారు. 

''క్వారంటైన్లో రోగులకు నాణ్యమైన ఆహారం, మందులు లేక కష్టాల కొలిమిలో కాపురం చేయాల్సిన దుస్థితి నెలకొంది. రోగులకు అందించే భోజనాల్లో వైసీపీ నేతలు కక్కుర్తికి పాల్పడి వారికి నాసిరకం భోజనం అందిచటం సిగ్గుచేటు. కరోనా రోగులు భోజనాలు సరఫరా చేసే కాంట్రాక్టులు వైసీపీ నేతలు తీసుకోవటం వల్లే ఈ పరిస్థితి నెలకొంది'' అని అన్నారు. 

read more  తూగో జిల్లాలో కరోనా కలకలం... 22మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు పాజిటివ్

''ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీలేక బాధితులను వెనక్కి పంపుతుంటే మంత్రులు అన్ని వసతులు వున్నాయని చెప్పటం దుర్మార్గం. కార్పొరేట్ ఆసుపత్రులు లక్షల్లో బిల్లులు వేస్తుంటే మంత్రులకు కనిపించడం లేదు? కరోనాతో మృతి చెందిన వారిపట్ల ప్రభుత్వం కనీస మానవత్వం లేకుండా అవమానీయంగా వ్యవహరించటం బాధాకరం. చనిపోయిన వారి మృతదేహాలను జేసీబీతో తీసుకెళ్లడం ఏంటి? ప్రభుత్వం చేతకాని తనం వల్లే రాష్ట్రంలో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తున్నది'' అని అన్నారు. 

'' రాష్ట్రం ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా ముఖ్యమంత్రి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఇంటి నుంచి ఎందుకు బయటకు రావటం లేదు? గడప దాటకుండా ఎన్ని సమీక్షలు చేసినా ప్రయోజనం శూన్యం. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారులు కోవిడ్ ఆస్పత్రులకెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితుల్ని గమనించి, ప్రభుత్వ ఆదేశాలు అమలవుతున్నాయో లేదో చూడాలి. సంక్షోభాన్ని పరిష్కరించటం కంటే దాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించాలన్న వైసీపీ ప్రభుత్వ ఉద్దేశం అడుగడుగునా కనపడుతోంది''

''వైరస్ వ్యాప్తికి వైకాపా నేతలు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఇష్టానుసారంగా లాగ్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వైకాపా సమావేశాలు, సభలు, విందులు, జన్మదిన వేడుకలు నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గుంటూరులో వైయస్ జయంతిలో పాల్గొన్న 120 మందికి పరీక్షలు చేస్తే 25 మందికి పాజిటివ్ వచ్చింది'' అని వెల్లడించారు. 

''చిరువ్యాపారులు, రోజు వారీ కూలీలు ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు.వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేయాలి. కరోనాతో మరణించినవారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష పరిహారం చెల్లించాలి. ప్రభుత్వం కరోనా రోగులందరికీ ఉచిత, సమగ్ర చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. చికిత్సా కేంద్రాలను, వైద్యులను, వైద్య సదుపాయాలను పెంచాలి. ప్రైవేటు వైద్యశాలలో కూడా ఉచిత చికిత్సలు ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ ఆసుపత్రులపై సంపూర్ణ కఠిన నిబంధనావళిని ఏర్పాటు చేయాలి'' అని కళా వెంకట్రావు
 డిమాండ్ చేశారు.