ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఒక రోజు తగ్గుతూ మరో రోజు పెరుగుతూ వైరస్ ... అధికారులను భయాందోళనలకు గురిచేస్తోంది. కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కేసుల తీవ్రతలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రభుత్వం తల పట్టుకుంటోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 23,160 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 14,98,532కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 106 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 9686కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 9, అనంతపురం 8, తూర్పుగోదావరి 9, చిత్తూరు 8, గుంటూరు 7, కర్నూలు 5, నెల్లూరు 11, కృష్ణ 8, విశాఖపట్నం 11, శ్రీకాకుళం 8, పశ్చిమ గోదావరి 17, ప్రకాశం 4,  కడపలో ఒకరు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 24,819 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 12,79,110కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,01,330 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,82,41,637కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,09,736 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 2334, చిత్తూరు 2670, తూర్పుగోదావరి 3528, గుంటూరు 1501, కడప 1221, కృష్ణ 1496, కర్నూలు 1310, నెల్లూరు 1239, ప్రకాశం 1590, శ్రీకాకుళం 1440, విశాఖపట్నం 2007, విజయనగరం 945, పశ్చిమ గోదావరిలలో 1879 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.