రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది శాసనసభ్యులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే వారంతా తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో చర్చించారని జనసేన రాష్ట్ర కన్వీనర్ పార్థసారథి చెప్పారు. పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్న తర్వాత తేదీ ఖరారు చేసి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. 

శుక్రవారం రాజమహేంద్రవరంలో జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మేడా గురుదత్‌ ప్రసాద్‌, ఉభయగోదావరి జిల్లాల కన్వీనర్‌ కలవకొలను తులసితో కలిసి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. 

వివిధ పార్టీల నుంచి పలువురు ముఖ్య నేతలు కూడా జనసేనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాట్లు ఆయన తెలిపారు. పార్టీలో కొత్త తరానికి 60 శాతం సీట్లు ఇస్తామని చెప్పారు. పాత, కొత్త తరం కలయికలతో పార్టీ సమర్థంగా నడుస్తుందనే నమ్మకం తమకుందని చెప్పారు. 

రాబోయే ఎన్నికల కోసం రాష్ట్రస్థాయి మేనిఫెస్టోతో పాటు ప్రతి నియోజవర్గానికీ మేనిఫెస్టో తయారు చేస్తామని చెప్పారు.