కన్నతల్లి చిన్నప్పుడే వదిలేసి పోవడం, తండ్రి రెండేళ్ల క్రితం కన్నుమూయడం ఆ యువకుడి పాలిట శాపాలుగా మారాయి. దీనికి సవతి తల్లి కాఠిన్యం తోడైంది. చివరికి యువకుడి ఉసురు తీసింది. వివరాల్లోకి వెడితే... 

శ్రీకాకుళం జిల్లా, పొందూరు  మండలంలోని వీఆర్‌ గూడెం గ్రామానికి చెందిన యువకుడు పైడి నర్సింహమూర్తి(19) శుక్రవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సవతి తల్లి వేధింపులు భరించలేకే తనువు చాలిస్తున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. 

కన్నతల్లి చిన్నప్పుడే వదిలి వెళ్లిపోవడంతో నర్సింహమూర్తి సవతి తల్లి వద్ద పెరిగాడు. తండ్రి రెండేళ్ల క్రితం చనిపోవడంతో సవతి తల్లి వేధింపులకు గురిచేస్తోందంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. అత్తమామల దయతో పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేశానని, ఉన్నత చదువులు చదువుకోవాలని ఉత్సాహం ఉన్నా పట్టించుకునే వారు, ప్రోత్సహించే వారు లేరని, అందుకే చనిపోతున్నానని, అత్తమామలు, బావ క్షమించాలని నోట్‌లో పేర్కొన్నాడు. 

పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  రెండేళ్ల క్రితం తండ్రి చనిపోయినప్పటినుంచి  నర్సింహమూర్తి ముభావంగా ఉంటున్నాడు. బాగా చదువుకోవాలనే ఉత్సాహం ఉన్నా ప్రోత్సహించే వారు లేకపోవడం, సవతి తల్లి వేధింపులు వెరసి తీవ్ర మనస్థాపానికి గురై శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఆర్‌.దేవానంద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.