వివాహేతర సంబంధం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం దిగువపూడి గ్రామానికి చెందిన వంశీ స్థానికంగా ఉన్న త్రివేణి క్రషర్‌లో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

గురువారం ఉదయం కట్టెల కోసమని అడవికి వెళ్లిన వంశీ సాయంత్రం కావొస్తున్నా ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని తల్లీదండ్రుడు స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దట్టమైన అటవీప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో అక్కడికి వెళ్లి చూశారు.

ఓ యువకుడి తల, కాలు, చెయ్యి లేని మొండెం కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. అక్కడ దొరికిన సెల్‌ఫోన్, మొలతాడు ఆధారంగా మృతదేహం తమ కుమారుడిదిగానే గుర్తించి, విషయాన్ని పోలీసులకు అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కుటుంబసభ్యులతో కలిసి వంశీ తల కోసం సుమారు ఐదు గంటల పాటు అడవి మొత్తం గాలించారు. చివరికి 40 మీటర్ల దూరంలో ఓ లుంగీలో కట్టి, పూడ్చి పెట్టిన తలను పోలీసులు కనుగొన్నారు. రెండు రోజుల క్రితం హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

శరీరభాగాలను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వంశీ గత కొంతకాలంగా అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడని.. వారే తమ కుమారుడిని దారుణంగా హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు.