ఫణి తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో... ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఎండలు విజృంభించాయి. ఎండ తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే వడదెబ్బ తగిలి... 17మంది మృతి చెందారు.

ఎండల తీవ్రత అంతకంతకుపెరిగిపోతోంది. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వృద్ధులు, పిల్లలు అనే వయసు బేధం లేకుండా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి లాగేస్తున్నాయి.ముఖ్యంగా వృద్ధులు, పసిపిల్లల పై వడ దెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటోంది.  సోమవారం ఒక్కరోజే ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరులో నలుగురు వడగాల్పులకు బలయ్యారు. ఈ విధంగా ఏపీలో ఇప్పటివరకు వడదెబ్బకు 17 మంది మృతి చెందారు.

దీంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. వడ దెబ్బ నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాలని సూచనలు చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. నీరు, కొబ్బరినీరు, నిమ్మకాయ నీరు వంటివి తాగాల్సిందిగా సూచిస్తున్నారు.