Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఆపరేషన్ ఆకర్ష్: వైసిపిలోకి పల్లె సహా 15 మంది టీడీపి ఎమ్మెల్యేలు

గత రెండు నెలల వ్యవధిలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు వైసీపీలో చేరడం అధికార పార్టీకి మింగుడుపడటం లేదు. వైసీపీలో చేరిన టీడీపీ నేతల దారిలోనే మరికొంతమంది పయనిస్తున్నారని ఎన్నికల సమయానికి దాదాపు 15 మంది సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 
 

15 TDP MLAs may join in YCP soon
Author
Ananthapuram, First Published Feb 18, 2019, 4:41 PM IST

 
అనంతపురం: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా గుర్తింపు పొందిన వారు ఒక్కొక్కరుగా పార్టీ వీడేందుకు రెడీ అవుతున్నారు. 

గత రెండు నెలల వ్యవధిలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు వైసీపీలో చేరడం అధికార పార్టీకి మింగుడుపడటం లేదు. వైసీపీలో చేరిన టీడీపీ నేతల దారిలోనే మరికొంతమంది పయనిస్తున్నారని ఎన్నికల సమయానికి దాదాపు 15 మంది సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

2019 ఎన్నికల్లో ఎలాగైనా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు నానా పాట్లు పడుతున్నారు. ఎక్కడా లేని హామీలు ఇస్తూ అందర్నీ ఆకట్టుకునే పనిలో పడ్డారు. అంతలా కష్టపడుతున్న ఆయనకు పార్టీ నేతలు ఒక్కొక్కరుగా హ్యాండ్ ఇవ్వడం ఆయనకు మింగుపడటం లేదు. 

ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు పార్టీ మారిన నేపథ్యంలో వలసలు ఎలా నివారించాలో తెలియక తలలు పట్టుకుంటున్న తెలుగుదేశం పార్టీకి మరోషాక్ తగిలే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన మాజీమంత్రి ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడిన తొలికేబినెట్ లో పల్లె రఘునాథ్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఎలాంటి ఆరోపణలు లేకుండా సమర్థవంతంగా పనిచేశారని టాక్. అయితే అలాంటి వ్యక్తిని కేబినేట్ విస్తరణలో తప్పించారు చంద్రబాబు నాయుడు. 

తనను మంత్రి వర్గం నుంచి తొలగించడంపై పల్లె రఘునాథ్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోయారు. అలకపాన్పు ఎక్కారు. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు నాయుడు పల్లె రఘునాథ్ రెడ్డిని బుజ్జగిచేందుకు చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు. 

చీఫ్ విప్ పదవి ఇస్తున్నట్లు ప్రకటించినా దాదాపు నెలరోజుల వరకు ఉత్తర్వులు విడుదల చెయ్యకపోవడంతో పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆ తర్వాత ఉత్తర్వులు విడుదలైనప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదన్నది బహిరంగ రహస్యం. 

అయితే రాబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యకూడదని నిర్ణయించుకున్న పల్లె రఘునాథ్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారట. ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎలాంటి భరోసా ఇవ్వలేదని సమాచారం. 

సమర్థవంతంగా పనిచేస్తున్న మంత్రి పదవిని తొలగించారని, అలాగే చీఫ్ విప్ పదవి విషయంలో నానా తిప్పలు పెట్టారని అన్నీ సహించానని అయితే  రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించాలని కోరితే చంద్రబాబు స్పందించకపోవడాన్ని పల్లె రఘునాథ్ రెడ్డి అవమానంగా భావిస్తున్నారట. 

అలాగే అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి, పరిటాల సునీత కుటుంబాలకు ఇస్తున్న ప్రాధాన్యత తనకు ఇవ్వడం లేదని పల్లె రఘునాథ్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోయారట. తెలుగుదేశం పార్టీలో చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిగా తాను కొనసాగుతున్నానని పార్టీలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అన్నీ భరిస్తున్నా తనకు అవమానాలే ఎదురవుతున్నాయని సన్నిహితుల వద్ద బాధపడ్డారని తెలుస్తోంది. 

పార్టీలో ఉండి అవమానాలు భరించేదాని కంటే పార్టీ వీడటమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తానని హామీ ఇస్తే వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని స్పష్టం చేస్తున్నారట. 

అయితే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చే అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఎలాంటి ఖచ్చితమైన హామీ రాలేదని తెలుస్తోంది. వైఎస్ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తే అప్పుడు వైసీపీ కండువా కప్పుకునేందుకు పల్లె రఘునాథ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.    
 

Follow Us:
Download App:
  • android
  • ios