ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల పరిధిలో తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో 15మంది గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది.
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ 40మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డుమధ్యలోని డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15మంది గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది.
వివరాల్లోకి వెళితే... విశాఖపట్నంలో ఆదివారం రాత్రి 40మంది ప్రయాణికులతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. రాత్రంతా ప్రయాణించి ఇవాళ తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ జిల్లాకు చేరుకుంది. మరో మూడు నాలుగు గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుందని భావించిన ప్రయాణికులు హాయిగా నిద్రిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా బస్సు ప్రమాదానికి గురయ్యింది.
కంచికచర్ల మండలంలోని పరిటాల బైపాస్ పై ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బస్సు ప్రమాదానికి గురయ్యింది. లారీని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లిన బస్సు డివైడర్ ను ఢీకొట్టి ఆగింది. దీంతో బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ప్రమాద సమయంలో బస్సులో ట్రావెల్స్ సిబ్బందితో పాటు 40మంది ప్రయాణికులు వున్నారు. వీరిలో 15మంది గాయపడగా ఓ ముగ్గురు మాత్రం చాలా తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.
బస్సు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా క్షతగాత్రులను దగ్గర్లోని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడినవారిని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.
అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని... ఇలాంటి వ్యక్తి చేతికి బస్సు అప్పగించి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడారంటూ ట్రావెల్స్ సంస్థపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కంచికచర్ల మండలం పరిటాల జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ యస్. డిల్లీ రావు నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్, రెవెన్యూ అధికారులతో చర్చిస్తున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేసారు కలెక్టర్ ఢిల్లీ రావు.
