కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్నబిడ్డపైనే అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం అరుంధతిపేటకు చెందిన ఓ వ్యక్తి నిత్యం మద్యం సేవించి ఇంటికి వస్తుండటంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి.

అయితే భర్తతో గొడవ జరిగినప్పుడల్లా భార్య తన పుట్టింటికి వెళ్లేది. ఒక్కోసారి తమ కుమార్తెను తండ్రి వద్దనే వదిలిపెట్టి వెళ్లేది. ఇదే అదనుగా తీసుకున్న ఆ కామాంధుడు కన్నకూతురిపై కన్నేశాడు.

ప్రతిరోజు మద్యం సేవించి వచ్చి కూతురిపై అత్యాచారం చేసేవాడు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా ఆ చిన్నారి అనారోగ్యంగా ఉండటంతో ఆమె తల్లి శనివారం ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి.. బాలిక గర్భవతని తేల్చారు.

ఈ దారుణానికి కారణం తన భర్తేనని అనుమానించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తండ్రిని అరెస్ట్ చేసి.. చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇక మరో ఘటనలో పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామానికి చెందిన వీరప్పరాజు శివయ్య అనే వృద్దుడు అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను గమనించి అత్యాచారానికి ప్రయత్నించాడు.

చిన్నారి కేకలు వేయడంతో స్థానిక యువకులు వచ్చి పాపను కాపాడి.. వృద్ధుడిని పోలీసులకు అప్పగించారు. బాధిత బాలిక తండ్రి 20 రోజుల క్రితం చనిపోవడంతో ఆ కుటుంబ పరిస్ధితిని అలుసుగా తీసుకుని సదరు కామాంధుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు.