ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షల తొలి రోజు కావడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులు నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. ఇక, ఈ నెల 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఉదయం 8.45 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నట్టుగా అధికారులు తెలిపారు. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. 

ఇక, రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తం 6,64,152 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందులో 6,09,070 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో.. 3,11,329 మంది బాలురు, 2,97,741 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలు రాసే రోజుల్లో విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. 

కిందటి ఏడాది పదో తరగతి పరీక్షల సందర్భంగా కొన్ని చోట్ల పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. ఈసారి అలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. విద్యార్థులు వాచ్‌లు, మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తారని అధికారులు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాలను నో ఫోన్ జోన్స్‌గా ప్రకటించారు. ఏ ఒక్కరూ పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.