ఓ పదేళ్ల బాలుడు తన తల్లి మరణించిన విషయాన్ని గుర్తించలేదు. తల్లి నిద్రపోతుందని భావించి.. నాలుగు రోజులుగా స్కూల్‌కు వెళ్లొచ్చేవాడు. మేనమామ ఫోన్ చేసిన సమయంలో ఇంట్లో దుర్వాసన వస్తుందని బాలుడు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

తిరుపతి విద్యానగర్‌ కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ పదేళ్ల బాలుడు తల్లి మృతదేహంతోనే కుమారుడు నాలుగు రోజులు ఉన్నాడు. తల్లి నిద్రపోతుందని భావించి.. రోజు స్కూల్‌కు కూడా వెళ్లొచ్చేవాడు. అయితే నాలుగు రోజులకు ఇంట్లో దుర్వాస వస్తుందని మేనమామకు ఫోన్ చేసి చెప్పడంతో.. అసలు విషయం వెలుగుచూసింది. వివరాలు.. రాజ్యలక్ష్మి అనే మహిళ తిరుపతిలోని ఓ ప్రైవేటు కాలేజ్‌లో టీచర్‌గా పనిచేస్తుంది. ఆమెకు పదేళ్ల కొడుకు శ్యామ్ కిషోర్ ఉన్నాడు. కుటుంబ కలహాలతో రాజ్యలక్ష్మి భర్తకు దూరంగా ఉంటుంది.

ప్రస్తుతం కొడుకుతో కలిసి రాజ్యలక్ష్మి తిరుపతిలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటుంది. ఈ నెల 8వ తేదీన రాజ్యలక్ష్మి ఇంట్లో కిందపడి చనిపోయిందని చెబుతున్నారు. అయితే రాజ్యలక్ష్మి మృతిచెందిందని తెలియన శ్యామ్ కిషోర్.. ఆమె నిద్రపోతుందని భావించారు. నాలుగు రోజులుగా స్కూల్‌కు వెళ్లి వస్తున్నాడు. ఇంట్లో ఉన్న ఆహారం, తినుబండరాలు తిన్నాడు. తల్లి పక్కనే పడుకునేవాడు.

అయితే శుక్రవారం సాయంత్రం మేనమాన దుర్గాప్రసాద్ ఫోన్ చేయడంతో ఇంట్లో దుర్వాస్తన వస్తుందని శ్యామ్ కిషోర్ చెప్పాడు. తల్లి నిద్రపోతుందని తెలిపాడు. దీంతో దుర్గాప్రసాద్‌ అక్కడికి వచ్చి చూడగా.. రాజ్యలక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో దుర్గాప్రసాద్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్యామ్ కిషోర్ మానసిక స్థితి సరిగా లేదని, అందుకే ఇలా జరిగిందని దుర్గాప్రసాద్‌ చెబుతున్నాడు.

రాజ్యలక్ష్మి నివాసం ఉంటున్న బిల్డింగ్‌లోనే ఉంటున్నవారు ఈ విషయం తెలుసుకుని షాక్ తిన్నారు. బాలుడు నిద్రపోతుందని కూడా ఎవరికి చెప్పలేదని.. బిల్డింగ్‌లోని వారు చెబుతున్నారు. వాళ్లు ఫోర్త్ ఫ్లోర్‌లో ఉండేవారని.. వాసన కూడా తమకు రాలేదని తెలిపారు. మానసిక ఎదుగుదల లేని కారణంగానే శ్యామ్ కిషోర్ ఇలా చేసి ఉంటాడని చెబుతున్నారు.