ఏపీ అసెంబ్లీలో గందరగోళం: 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీలో ఇవాళ గందరగోళ వాతావరణం నెలకొంది. బడ్జెట్ పై మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ విషయమై నిరసనకు దిగారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను శుక్రవారంనాడు సస్పెండ్ చేశారు. బడ్జెట్ పై మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని టీడీపీ సభ్యులు సభలో పట్టుబట్టారు. ఈ విషయమై టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు.
బడ్జెట్ పై చర్చను ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. అయితే సాంబశివరావుకు సభలో 17 నిమిషాలు సమయం కేటాయించారు. మరికొంత సమయం ఇవ్వాలని టీడీపీ సభ్యులు కోరారు. ఈ విషయమై టీడీపీ సభ్యులు స్పీకర్ ను సమయం కోసం కోరుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి బడ్జెట్ పై చర్చలో పాల్గొన్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. తమకు మైక్ ఇచ్చి మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ గొంతు నొక్కవద్దని కూడా కోరారు. స్పీకర్ పోడియం వద్ద నిలబడి టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
అయితే ఈ విషయమై మంత్రి బుగ్గన రాజేంథ్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. మరోసారి మాట్లాడే సమయంలో ఎక్కువ సమయం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సబ కార్యక్రమాలు జరిగేందుకు సహకరించాలని కోరారు. ఒక సభ్యుడి సమయాన్ని మరొకిరికి కేటాయిస్తామని చెప్పడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే కోన రఘుపతి బడ్జెట్ పై ప్రసంగించారు. అయితే రఘుపతి ఏం మాట్లాడుతున్నారనేది అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
ఈ సమయంలో మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు సంబంధించిన తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది. 10 మంది టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారుబడ్జెట్ లో ప్రభుత్వ డొల్లతనాన్ని బయట పెడుతున్నందునే సభ నుండి తమను సస్పెండ్ చేశారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుండి బయటకు వచ్చారు.
also read:AP Budget 2023-24 ....బుగ్గన బడ్జెట్ ప్రసంగానికి అడ్డు : 14 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
గత రెండు రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుండి సస్పెండయ్యారు. ఇవాళ కూడా సస్పెన్షన్ కు గురయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే లు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడులను ఈ అసెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.