17 ఎస్ఆర్ఓలలో నకిలీ చలాన్ల స్కాం, కోటి రికవరీ: రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషగిరిబాబు
రాష్ట్రంలోని 17 ఎస్ఆర్‌ఓలలో నకిలీ చలాన్ల కుంభకోణం జరిగిందని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరిబాబు చెప్పారు.ఈ కుంభకోణంపై విచారణ జరుగుతుందన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 17 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో చలాన్ల స్కాం చోటు చేసుకొందని ఆ శాఖ ఐజీ శేషగిరి బాబు చెప్పారు. ఈ కుంభకోణంపై ఏపీ సీఎం కూడ ఆరా తీశారు. విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని 17 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చలాన్ల కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై దర్యాప్తులో తేలుతుందని ఐజీ చెప్పారు. శుక్రవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు.
నకిలీ చలాన్ల స్కాం కారణంగా రూ. 5 కోట్లకుపైగా ఖజానాకు నష్టం వాటిల్లిందన్నారు. అయితే ఇందులో కోటి రూపాయాలను ఇప్పటికే రికవరీ చేశామన్నారు. రాష్ట్రంలోని 10 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ఈ చలాన్ల కుంభకోణం జరిగిందని అధికారులు గుర్తించారు. ఏడు కార్యాలయాల్లో చాలా తక్కువ మొత్తంలోనే కుంభకోణం జరిగిందన్నారు.
బోగస్ చలాన్ల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లపై ఏం చేయాలనే దానిపై కూడ న్యాయ సలహా తీసుకొంటున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఎస్ఆర్ఓలలో కొత్త సాఫ్ట్‌వేర్ ను అమల్లోకి తీసుకొచ్చామన్నారు. వారం రోజులుగా కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారానే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయని ఆయన చెప్పారు.