
పట్టు చీరలు మహిళలకు ఎంతో విలువైనవి. అవి ధర కాస్త ఎక్కువగా మహిళల అందాన్ని రెట్టింపు చేస్తాయి. పట్టు చీరలు ఎంత సెన్సెటివ్ గా ఉంటాయంటే చిన్న మరక పడినా వెంటనే తెలిసిపోతుంది. కొన్ని మరకలు ఏం చేసినా పోవు కూడా. చీరపై మరక చూసినప్పుడల్లా ఆ పట్టు చీర కట్టుకోలేకపోతున్నామని మహిళలు బాధ పడుతుంటారు. కాని పట్టు చీరలపై ఎలాంటి మరకలనైనా సులభంగా ఎలా తొలగించాలో ఇప్పుడు చూద్దాం.
ఇది కూడా చదవండి: చెవిలోని గులిమిని బడ్స్ లేకుండా సింపుల్ గా ఇలా తీసేయొచ్చు
పట్టు చీర కట్టుకున్నప్పుడు పూజలు వంటి ప్రత్యేక సందర్భాలలో నూనె చుక్కలు పడటం సహజమే. నూనె మరక పడిన వెంటనే శుభ్రమైన పొడి కాటన్ గుడ్డతో ఆ ప్రదేశంలో అద్దాలి. గుడ్డ లేకపోతే పేపర్, టవల్ తో కూడా నూనె పడిన చోట అద్దవచ్చు.
ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మరక పడిన చోట గట్టిగా రుద్దితే మిగతా చోట్లకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే నూనె పీల్చుకుని ఆ ప్రదేశంలో మరక పోవడం మొదలవుతుంది. నూనె పడిన చోట మాత్రమే మెల్లగా అద్ది మరకను తొలగించాలి.
ఇలా గుడ్డ లేదా పేపర్ టవల్ తో అద్దిన తర్వాత అక్కడ పౌడర్ చల్లి శుభ్రం చేయాలి. పౌడర్ చల్లి మరక పడిన చోటును నీటితో కడిగితే చాలు. పేరుకుపోయిన నూనె, మురికి అంతా పోతుంది. పొరపాటున కూడా వేడి నీటితో మరకలను తొలగించడానికి ప్రయత్నించవద్దు. వేడి నీరు పడితే మరక పోనే పోదు.
ఇది కూడా చదవండి: మొండి మరకలను చిటికెలో తొలగించే సింపుల్ టిప్స్ ఇవిగో
సబ్బు ద్రావణంతో కూడా పట్టు చీరపై ఉన్న మరకలను తొలగించవచ్చు. దీని కోసం గట్టి సబ్బును ఉపయోగించకుండా సున్నితంగా ఉండే లిక్విడ్ సోప్ లను ఉపయోగించాలి. లిక్విడ్ సోప్ ను చల్లటి నీటిలో కలిపి శుభ్రమైన కాటన్ గుడ్డను అందులో ముంచాలి. మొండి మరకపై మెల్లగా రుద్దాలి. వేగంగా లేదా గట్టిగా రుద్దితే పట్టు చీరలోని దారాలు తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మెల్లగా రుద్దాలి.
తర్వాత ఆ నురుగును తొలగించడానికి మరక ఉన్న చోట చల్లటి నీటితో కడగాలి. మరక పోయి చీర పాత స్థితికి వచ్చేస్తుంది. ఈ రెండు పద్ధతుల్లో పట్టు చీరలపై ఉన్న మరకలను సులభంగా తొలగించవచ్చు. మరకలు పోగొట్టడానికి ఓపిక చాలా అవసరం. మరకలు తొలగించేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోతే పట్టు చీరలు దెబ్బతింటాయి.