Feb 23, 2023, 10:33 AM IST
హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అదినేత్రి షర్మిల తమను అవమానించేలా మాట్లాడారని... ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ ట్రాన్స్ జెండర్స్ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో దిగివచ్చిన షర్మిల హిజ్రాలకు క్షమాపణలు చెప్పారు. హిజ్రాలను అవమానించాలన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉద్దేశం కాదని... వారిని కించపర్చాలని ఎప్పుడూ అనుకోలేదని షర్మిల అన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనను అవమానించేలా మాట్లాడితే సమాధానం చెప్పే క్రమంలో హిజ్రాలకు కూడా సమాజంలో గౌరవం, విలువుంది కానీ ఈ ఎమ్మెల్యేకు లేదని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు. ఒకవేళ తన మాటలతో హిజ్రా అక్కా చెల్లెళ్ల మనోభావాలు దెబ్బతింటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాని షర్మిల అన్నారు. తాను హిజ్రాల బాగోగులు గురించి ఆలోచిస్తున్నానని... ఈ ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ మీకేమయినా చేసారా ఆలోచించాలని షర్మిల అన్నారు. వైఎస్సార్ టిపి అధికారంలోకి రాగానే పేద హిజ్రాలకు ఇళ్లు ఇవ్వడమే కాదు... ఉద్యోగావకాశాలు లేని హిజ్రాలు వ్యాపారాలు చేసుకునేలా లోన్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బ్రతికేలా చూస్తానని మాటిస్తున్నానని షర్మిల అన్నారు.