వైసిపి నేత గంజి ప్రసాద్ హత్య... అట్టుడుకిన జి.కొత్తపల్లికి హోంమంత్రి వనిత

May 1, 2022, 2:34 PM IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి. కొత్తపల్లి గ్రామంలో వైసిపి నేత గంజి ప్రసాద్ హత్య నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. వైసిపికే చెందిన మరో వర్గానికి చెందిన ఎంపీటీసీ   బజారయ్యే ఈ హత్య చేశారని గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేస్తామని హోంమంత్రి హామీ ఇవ్వాలని మృతుడి కుటుంబసభ్యులు కోరగా తానేటి వనిత కొత్తపల్లికి చేరుకున్నారు. 

గంజి ప్రసాద్ మృతికి ప్రగాఢసానుభూతిని తెలిపిన హోంమంత్రి కుటుంబసభ్యులను పరామర్శించారు.  వైసిపి మంచి నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేసారు. గంజి ప్రసాద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి వనిత హామీ ఇచ్చారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఉన్నతాధికారులను వనిత ఆదేశించారు. హోంమంత్రితో పాటు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కూడా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు.