విజయవాడ ఆలయానికి రూ.70 కోట్లు: సీఎంకు దుర్గగుడి పాలక మండలి ధన్యవాదాలు

Dec 15, 2020, 4:41 PM IST

విజయవాడ: ఇవాళ(మంగళవారం) ఇంద్రకీలాద్రి దుర్గగుడి పాలక మండలి సమావేశమైన విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. దుర్గమ్మ ఆలయ అభివృద్ధి కొరకు సీఎం జగన్మోహన్ రెడ్డి రూ.70 కోట్లు  ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఓ తీర్మానాన్ని ఆలయ పాలకమండలి సభ్యులు ప్రవేశపెట్టారు.  అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు మీడియాకు వివరించారు. ఆలయ అభివృద్ధి కొరకు రూ.90 కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు.  జనవరి 5 నుండి 9వ తేదీ వరకు భవాని దీక్ష విరమణ కార్యక్రమం ఉందన్నారు. భవాని భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసామని...టైం స్లాట్ ప్రకారమే భవాని భక్తులు రావాలన్నారు. నది స్నానాలు, గిరి ప్రదక్షిణ, కేశవకండనకు అనుమతి లేదని... ఈ విషయాన్ని భవాని భక్తులతో పాటు సాధారణ భక్తులు గ్రహించాలన్నారు. మాల ఎక్కడ ధరించారో అక్కడే విరమణ చేసుకోవాలి సూచించారు.