Feb 21, 2023, 2:24 PM IST
విశాఖపట్నం : ఒకడికేమో సెల్ ఫోన్ దొరికితే చాలు... పక్కన బంగారం వున్నా పట్టించుకోడు. మరో ముఠాకేమో బంగారు ఆభరణాలే టార్గెట్. ఇలా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ సెల్ ఫోన్ దొంగను, మరో బంగారు ఆభరణాల దొంగల ముఠాను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ దొంగల వద్దనుండి రికవరీ చేసిన సెల్ ఫోన్లు, నగదు, బంగారం, ఇతర సామాగ్రిని మీడియా ఎదుట ప్రదర్శించారు పోలీసులు. ఈ దోపిడి దొంగలకు సంబంధించిన వివరాలు, దొంగతనాలు చేసే విధానాన్ని క్రైమ్ డిసిపి గంధం నాగన్న వివరించారు. గాజువాక ప్రాంతంలోని ఇళ్లలో, హాస్టల్స్ లో సెల్ ఫోన్ల ను దొంగిలిస్తున్న పాత నేరస్తుడు దామోదర్ రావు మళ్లీ పోలీసులకు పట్టుబడ్డారు. అతడిపై ఇప్పటికే 14 కేసులుండగా తాజాగా మరోకేసు నమోదయ్యింది. అతడివద్ద దొంగిలించిన 32 మొబైల్స్, రూ.2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే భీమిలి పీఎస్ పరిధిలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురి దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. వీరి వద్ద రూ.16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులను డిసిపి నాగన్న అభినందించారు.