Feb 23, 2023, 1:32 PM IST
హైదరాబాద్ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గత రెండేళ్ల మాదిరిగానే ఈసారి కూడా సొంతపార్టీ కార్యకర్తల కోసం కోటి రూపాయల విరాళం అందించారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారిని ఉచితంగానే ప్రమాద బీమా అందిస్తున్న విషయం తెలిసిందే. జనసేన సభ్యత్వం వుంటే చాలు... ఐదు లక్షల వరకు ప్రమాద బీమా, వైద్య ఖర్చులకు రూ.50వేల రూపాయల వరకు పొందవచ్చు. ఇందుకోసమే ప్రతి ఏడాది కోటి రూపాయలు అందిస్తున్న పవన్ మూడో ఏడాది కూడా విరాళం అందించారు. హైదరాబాద్ లోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, కోశాధికారి రత్నంలకు పవన్ చెక్కు అందజేసారు. ఈ సందర్భంగా... జనసేన నాయకులంతా క్రీయాశీలక సభ్యత్వ సమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవన్ కల్యాణ్ కోరారు.