Mar 3, 2022, 5:57 PM IST
అమరావతి: వైసిపి ప్రభుత్వ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. మందడంలో రాజధాని రైతులు, మహిళల దీక్ష శిబిరాన్ని ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏపీ ప్రజలకు ఈరోజు ఎంతో శుభదినమన్నారు. భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంది కాబట్టి రైతులకు న్యాయం జరిగిందని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు అన్ని విధాలుగా ఆలోచించి రైతుల పక్షాల నిలిచి మంచి నిర్ణయం తీసుకున్నారు... ఇది రైతు విజయం అన్నారు. ఇకనైనా ప్రభుత్వం పని తీరును మార్చుకుని ఈ 20 నెలలైనా ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానని సుజన అన్నారు. ''రాజధాని అమరావతి అక్కడే ఉంటుందని గతంలో చెప్పాను... అలాగే ఉంటుంది. మీరు చేసిన న్యాయస్థానం దేవస్థానం పాదయాత్ర విజయవంతమైంది. ఇది తొలివిజయం. ఇక జగన్ మనసు మార్చాలని దేవున్ని కోరుకుందాం. నేడు హైకోర్టులో వచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే మళ్లీ అక్కడ కూడా రాజ్యాంగబద్ధంగానే తీర్పు వెలువడుతుంది. కాబట్టి రైతులు దేని గురించి ఆలోచన చెంది బాధపడాల్సిన అవసరం లేదు'' అని ఎంపీ సుజనా చౌదరి అన్నారు.