Feb 21, 2023, 1:06 PM IST
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ హోదాలో చివరిసారిగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు బిశ్వభూషణ్ హరిచందన్. చత్తీస్ ఘడ్ రాష్ట్ర గవర్నర్ గా బిశ్వభూషణ్ బదిలీకాగా ఏపీ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ ను నియమించారు రాష్ట్రపతి. ఈ నేపథ్యంలో బిశ్వభూషణ్ చత్తీస్ ఘడ్ కు వెళ్లేముందు చివరగా నేడు సతీసమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు గవర్నర్ దంపతులకు సాదర స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం గవర్నర్ దంపతులకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేసారు అర్చకులు. ఈ సందర్భంగా దుర్గమ్మ కృపాకటాక్షాలు ఎల్లవేళలా తమపై వుండాలని కోరుకున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. ఇంతకాలం ఏపీ గవర్నర్ గా తెలుగు ప్రజలకు సేవలందించడం ఆనందంగా వుందన్నారు. ఎక్కడున్నా ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలను మరిచిపోనని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు.