ఉసా కరోనా కోరల్లో చిక్కి అకస్మాత్తుగా మరణించడం తెలుగు సమాజానికి తీరని లోటని బిఎస్ రాములు పేర్కొన్నారు.
హైదరాబాద్: బహుజన శ్రామిక యోధుడు, నిరంతరం జ్వలించే ఉద్యమ కారుడు ఉ. సాంబశివరావు(ఉ. సా) శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. ఈ వార్త దిగ్భ్రాంతి కలిగించింది బిసి కమీషన్ ఛైర్మన్ బిఎస్ రాములు వెల్లడించారు. నిరంతరం బహుజన శ్రామిక వర్గాల చైతన్యం కోసం పరితపించిన మేధావి, సామాజిక తత్వవేత్త. ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉసా అని... ఆయన లక్షలాది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కళ్లల్లో వెలుగు అని రాములు కొనియాడారు.
''ఉసా కరోనా కోరల్లో చిక్కి అకస్మాత్తుగా మరణించడం తెలుగు సమాజానికి తీరని లోటు. ఒక నికార్సయిన సహచరుడిని కోల్పోయాము. ఉసా కూతురికి, కుటుంబానికి , అభిమానులకు, సహచరులకు , అనుచరులకు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు జేస్తూ శ్రద్దాంజలి. వారి ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి. ఎప్పటికన్నా ఇప్పుడీ కర్తవ్యం నిర్వహించడం మరింత అవసరం'' అని రాములు పేర్కొన్నారు.
undefined
''ఉసాతో ముప్పయేండ్ల జ్ఞాపకాలు. 1991 బహుజన రచయితల కళాకారులకు ఒక వేదిక నిర్మించాలని ఎక్కడి కక్కడ ప్రయత్నాలు జరిగాయి. ఉసా మార్క్సిస్టు అవగాహనతో ఆంధ్ర తెలంగాణ జిల్లాల్లో చాలా కాలం పని చేశారు. అనుభవ అధ్యయనాల క్రమంలో వర్గం కులం జోడించి వర్గకుల దృక్పథంతో ముందుసాగాలని 1987 లో పుస్తకం రాసి తనను తాను స్పష్టం పరుచుకున్నారు. అపుడే వర్గకుల సమస్య పై చర్చలు చేస్తున్న కె జి సత్యం మూర్తి తో చర్చించి రామారావు తదితరులు కలిసి మార్క్సిస్టు లెనినిస్టు కేంద్రం పేరిట ఒక బృందంగా ఏర్పడ్డారు. ఎదురీత అనే సైద్దాంతిక మాస పత్రిక నిర్వహించారు'' అని గుర్తుచేశారు.
''సైద్ధాంతిక పోలరైజేషన్ కు ఎదురీత ఒక చారిత్రక పాత్ర నిర్వహించింది. మరోవైపు బియస్పి నుండి నారగోని, అంబేద్కరిజం నుండి మాస్టార్జీ, వామపక్ష భావజాల తాత్వికత చాలదని ప్రాధాన్యతలు, కార్యక్రమాలు మార్చుకోవాలని గూడ అంజయ్య , ఇంగిలాల రామచంద్ర రావు, తులసి సంపత్ కుమార్, బొజ్జా తారకం, కంచె ఐలయ్య , కత్తి పద్మారావు మొదలైనవారు కుల సమస్యను, అంబేద్కరిజాన్ని కలుపుకొని సాగాలని భావించారు. వీరంతా దరకమే ఐక్య వేదిక ( బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక) నిర్మాణంలో పాల్గొన్నారు. అనేక జిల్లా సభలు సమావేశాలు జరిగాయి. రాష్ట్ర మహా సభలు ఫిబ్రవరి నెలలో 1993 లో హైదరాబాదులో జరిగాయి. ఉసా దాని ప్రణాళిక రూపొందించారు'' అని తెలిపారు.
''సమస్త వర్ణ వర్గ కుల లింగ జాతి మత ప్రాంత భాష దేశ విచక్షణ లేకుండా అసమానతలకు వ్యతిరేకంగా అంబేద్కరిజం పునాదిగా సాహిత్య సామాజిక తాత్త్విక సాంస్కృతిక రంగాలలో కృషి చేయాలని నిర్ణయించారు. బి ఎస్ రాములు వ్యవస్థాపక అధ్యక్షుడుగా, మాస్టార్జీ ప్రధాన కార్యదర్శిగా , ఉసా ఉపాధ్యక్షులుగా , మార్గంలోని , ఇంగిలాల కార్యదర్శులుగా కార్య వర్గం ఏర్పాటైంది. ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు తీసుకుంది. 1992 నుండి తెలుగునాట సాహిత్య చరిత్రలో అది ఒక మహోజ్వల ఘట్టం. ఎదురీత పత్రిక ద్వారా ఉసా చేసిన కృషి రాసిన వ్యాసాలు సమాజ గమనంలో ఎంతో ప్రభావితం చేసాయి'' అని అన్నారు.
''అటు తరువాత ఉసా ఏక లవ్య పత్రిక నిర్వహించారు. సామాజిక రాజకీయ ఐక్యకార్యాచరణ అవసరం అని అనేక ప్రయోగాలు చేశారు. మందకృష్ణ మాదిగ, ఆర్ కృష్ణయ్య తదితర సామాజిక వర్గాలతో కలిసి పని చేశారు. డఫోడం నిర్మాణంలో పాల్గొన్నారు. మారోజు వీరన్న చేసిన సైద్ధాంతిక పోరాటంలో పూర్తి స్థాయిలో మద్దతు గా నిలిచారు. డాక్యుమెంట్ ల రచనలో పూర్తి సహకారం అందించారు'' అని గుర్తుచేశారు.
''ఉ సా 1998 లో కుల సంఘాల రాష్ట్ర మహా సభలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. మేమెంతో మాకంత వాటా రాజ్యాధికారం అని పిలుపునిచ్చారు. అదే మాటపై చివరిదాకా నిలిచారు. రాజీలేని పోరాటం చేశారు. ఎవరెంత మాట్లాడినా చివరి వక్తగా మాట్లాడానికి ఏమీ మిగలక పోయినా చివరకు తనవైన కొత్త పాయింట్లు చెప్పడం ఉసా విశిష్టత.
సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించి రెండేండ్లుగా ''దశ దిశ'' యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ తన ఇల్లునే కార్యాలయంగా మలిచారు. బీసీ రిజర్వేషన్ల కోసం న్యాయస్థానాలు ఆశ్రయించి కొన్ని విజయాలు సాధించారు. ఉ సా తనవైన అనేక గ్రంథాలను ప్రచురించారు. షష్టి పూర్తి సందర్భంగా ఉసాను అభిమానులు, సహచరులు ''ఉద్యమాల ఉపాధ్యాయుడు'' అనే బిరుదుతో సత్కరించారు'' అని రాములు గుర్తుచేశారు.