21 డిమాండ్లే కాదు.. అన్ని సమస్యలపై చర్చించాల్సిందే: అశ్వత్థామరెడ్డి

By sivanagaprasad KodatiFirst Published Oct 28, 2019, 5:22 PM IST
Highlights

అన్ని సమస్యల మీద చర్చించాల్సిందేనని.. 21 డిమాండ్లపై చర్చిస్తామంటే కుదరదన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. చర్చలకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని దీనిని బస్‌పాస్ రీయంబర్స్‌మెంట్ రూ.1,099 కోట్లు, మున్సిపల్ యాక్ట్ ప్రకారం రూ.1,300 కోట్లు ప్రభుత్వం తరపునుంచి ఆర్టీసీకి రావాల్సి ఉందన్నారు.

అన్ని సమస్యల మీద చర్చించాల్సిందేనని.. 21 డిమాండ్లపై చర్చిస్తామంటే కుదరదన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.

ఆర్టీస సమ్మెపై హైకోర్టులో వాదనలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్పోరేషన్‌ నుంచి కార్మికులకు రావాల్సిన సొమ్ముపై తగిన పత్రాలను తీసుకుని మంగళవారం హాజరవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించిందన్నారు.

నాలుగు డిమాండ్లకు సంబంధించి రూ. 47 కోట్లు అవసరమవుతుందని ప్రభుత్వం తెలిపిందని.. అయితే తమకు రూ.2, 276 కోట్లు రావాల్సి ఉందని అశ్వత్థామరెడ్డి తెలిపారు. చర్చల మధ్యలోంచి తాము బయటకు రాలేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

చర్చలకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని దీనిని బస్‌పాస్ రీయంబర్స్‌మెంట్ రూ.1,099 కోట్లు, మున్సిపల్ యాక్ట్ ప్రకారం రూ.1,300 కోట్లు ప్రభుత్వం తరపునుంచి ఆర్టీసీకి రావాల్సి ఉందన్నారు.

యూనిఫామ్‌కు సంబంధించి రూ.5 కోట్ల 7 లక్షలు, మెడికల్ రీయంబర్స్‌మెంట్‌ రూ.29 కోట్లు విడుదల కావాల్సి వుందన్నారు. ఖమ్మంలో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యపై స్పందించిన ఆయన బలవన్మరణాలు సమస్యకు పరిష్కారం కాదని సూచించారు.

కార్మికులు ధైర్యంగా ఉండాలని.. ఆత్మహత్యలు చేసుకుంటే పోరాడేవారిని బలహీనపరిచినట్లుగా ఉంటుందని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. బలిదానాలొద్దని.. అంతిమ విజయం ధర్మానిదేనన్నారు.

ఆర్టీసీ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేదనిని కార్మికులు వదులుకున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆర్టీసీలో విలీనాన్ని వదలుకోమని తాము చెప్పలేదని న్యాయమూర్తి తెలిపారని... ప్రభుత్వం ఉద్దేశ్యం చెప్పాలనే కోర్టు చెప్పిందని , వదులుకోమని చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. 

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం 2.30కి మరోసారి విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా ఎల్లుండికి గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా.. హైకోర్టు కుదరదని చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో రైళ్లలో కంటే బస్సుల్లోనే జనం ఎక్కువగా ప్రయాణం చేస్తారని.. తమకు ఈడీ కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వలేదని ధర్మాసనం ప్రశ్నించింది.

21 డిమాండ్లలో 5 డిమాండ్లు పరిష్కరించలేరా అని నిలదీసింది. నివేదికలను తమ వద్ద కూడా దాచి పెడతారా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమైతే ఏం చర్యలు తీసుకోవాలో చెప్పాలని తెలిపింది. టూల్స్, స్పేర్ పార్ట్స్ ఎందుకు సమర్పించలేదంటూ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుపై న్యాయస్థానం మండిపడింది. 

ఇదే సమయంలో కార్మికుల సమ్మెలపై ఆర్టీసీ యాజమాన్య వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సూచించింది. అదనపు అడ్వొకేట్ జనరల్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..వెంటనే ఆయనను హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది.

ఆర్టికల్ 226 ప్రకారం కోర్టుకు ఎలాంటి అధికారాలున్నాయో.. కోర్టుకు తెలిపే అధికారం అదనపు అడ్వొకేట్ జనరల్‌కు లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాలతో ఏఏజీ బీఎస్ ప్రసాద్ వెంటనే ధర్మాసనం ముందు హాజరయ్యారు. 

click me!