Latest Videos

రామోజీ రావుకు అది చాలా పెద్ద వ్యసనం.. నాకు ఎలా ఉపయోగపడిందంటే!- ఎడిటర్స్ కామెంట్

By Venugopal Bollampalli - EditorFirst Published Jun 8, 2024, 12:04 PM IST
Highlights

మీరు ఏ పత్రిక, టీవీ, డిజిటల్ ఎడిషన్ తీసుకున్నా అక్కడ తప్పకుండా రామోజీరావు ‘బ్రాండెడ్’ జర్నలిస్టులు, టీం తప్పక ఉంటుంది. ఆయన కేవలం ఈనాడును మాత్రమే కాదు.. తన విలువైన మార్గదర్శకత్వంతో తెలుగు జర్నలిజం క్వాలిటీని చాలా ఎత్తుకు తీసుకెళ్లగలిగారు. వేల మంది పాత్రికేయ సైన్యాన్ని ఆయన సృష్టించగలిగారు.
 

రామోజీ రావు.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. ప్రపంచ జర్నలిజం చరిత్రలో ఎన్నో కొత్త ఒరవడులకు నాంది పలికి వాటిని విజయవంతం చేసి చూపించిన మహనీయుడు. ఈనాడు, మార్గదర్శి, ఈటీవీ, సినిమాలు, పచ్చళ్లు, ఫిల్మ్ సిటీ ఇలా ఆయన పట్టిందల్లా బంగారమైంది. ప్రతీ రంగంలోనూ ఆయనది చెరగని ముద్ర. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన చాలా తక్కువ కాలంలోనే తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ రాజకీయాలను కూడా శాసించ గలిగే స్థాయికి ఎదిగారు. ఇలా చెప్పుకుంటూ పోయే రామోజీరావు గురించి ఓ పెద్ద పుస్తకమే రాయొయ్చు. 

ఈనాడులో నా 12 ఏళ్ల కెరీర్‌లో ఆయనతో ప్రత్యక్ష అనుబంధం చాలా తక్కువ. కానీ పరోక్షంగా ప్రతి రోజూ ఆయనతో చాలా ఎగ్జైట్ మెంట్ ‌తో కూడిన అనుబంధం ఉండేది. ప్రధానంగా నేను ఈనాడు ప్రధాన ఎడిషన్ (మెయిన్ ఎడిషన్)కి పని చేస్తున్న రోజుల్లో సాయంత్రం ఎనిమిది గంటలైతే చాలు.. బాస్ (రామోజీ రావు) చదివిన ఈనాడు పేపర్ ఎప్పుడు డెస్కుకు వస్తుందా అని ఎదురు చూసేటోడిని. ఎందుకంటే ఈనాడు పేపర్ ఆయనకు అతి పెద్ద వ్యసనం.

ఉదయం నాలుగు గంటలకు ఆయన దినచర్య మొదలవుతుంది. ఆయన మొదట చేసేపని ఏంటో తెలుసా.. ఆ రోజు వచ్చిన ఈనాడు పేపర్‌ని అక్షరం వదలకుండా దాదాపు గంటన్నర పాటు పూర్తిగా చదివేవారు. కేవలం చదవడం మాత్రమే కాకుండా ప్రతి వార్తలోనూ, ప్రతి అక్షర దోషాన్ని రెడ్ పెన్ తీసుకుని ఓ మాస్టర్ లాగా దిద్ది దాన్ని తమ సిబ్బందికి పంపేవారు.

వాస్తవానికి ఆ స్థాయి వ్యక్తి రోజుకు గంటన్నర పాటు సమయాన్ని ఓ పేపర్ చదవడానికి కేటాయించాల్సిన పని లేదు. ఓ మాట చెబితే అంతా సిబ్బందే చూసుకుంటారు. కానీ ఆయనకు అదే వ్యసనం. ఈనాడులో ప్రతి రోజూ కొన్ని మార్పులను, ఇంప్రూవ్ మెంట్ ఏరియాస్ ను సూచిస్తూ. రోజు రోజుకీ పేపర్‌లో కంటెంట్ క్వాలిటీని, కొత్త ఫీచర్లను, కొత్త కథనాలోచనలను ఇంప్లిమెంట్ చేస్తూ.. తెలుగు మీడియాలో మరెవరికీ సాధ్యం కానంత ఎత్తుకు ఈనాడుని తీసుకెళ్లారు.

ఆయన కేవలం తప్పు మాత్రమే చూడరు.. ఆరోజు వచ్చిన పేపర్లో ఆసక్తికర, ప్రతి ఒక్కరినీ చదివించే రీతిలో, సమాయాజికి పనికొచ్చే రీతిలో ప్రచురించిన కథనాలను అభినందిస్తూ సిబ్బందిని ఎంకరేజ్ చేసేవారు. ఆయన చేసే కామెంట్లు సిబ్బందికి చాలా మంచి 'కిక్’ ఇచ్చేవి. ఈ ఎంకరేజ్ మెంట్ తో మేం మరింత ఉత్సాహంగా పని చేసేవాళ్లం.

డెస్కులో ఎవరికీ నచ్చదిని ఆయనకు నచ్చేది..!!

నేను ఈనాడులోని ప్రధాన ఎడిషన్ డెస్కులో పని చేస్తున్నడపుడు రామోజీరావుకు వయసు 75 - 80 ఏళ్లు ఉంటుందనుకుంటా. ఆ వయసులోనూ ఆయన ఓ పాతికేళ్ల కుర్రాడిలా ఆలోచించేవారు. మేం యువతను ఆకర్షించేలా, యువతకు ఇంట్రెస్టింగ్ గా కొన్ని, కొన్ని స్టోరీలు, ఫొటోలను కొన్ని ప్రయోగాత్మక హెడ్డింగులతో ప్రచురించేవాళ్లం. కానీ డెస్కులో కొందరు  సీనియర్ జర్నలిస్టులకు అవి నచ్చేవి కాదు. కానీ యువతకు అవసరమైది కనుక వాళ్లకు నచ్చజెప్పి ఆ స్టోరీలు, ఫొటోలను హెడ్డింగ్స్‌లను ప్రచురించే వాళ్లం. వీటిపై రామోజీరావుగారు ఏం చెబుతారో అని ఆసక్తిగా ఆయన చదివి మార్క్ చేసిన పేపర్ కోసం ఎదురు చూసేవాళ్లం. కానీ దాదాపు ప్రయోగం చేసిన ప్రతి సారీ.. ఆయన "బాగు" అభినందనలు, శెహ్‌బాష్, వంటి కామెంట్లతో మెచ్చుకునేవారు. అప్పుడు అర్థం అయ్యేది చైర్మన్ ఎంత యంగ్ గా ఆలోచిస్తున్నారో అని. వాస్తవానికి రామోజీరావులోని అలాంటి ఆలోచనా ధోరణే.. నేడు ఈనాడు ప్రతి ఒక్కరికీ ఇష్టమైన పత్రికగా, వేదికగా మలచింది.

ఒక్కమాటలో చెప్పాలంటే..
రామోజీరావు వయసు ఎంత పెరిగినా ఆలోచనల్ల్లో మాత్రం నిత్య యవ్వనుడు. నేను ఈ రోజు ఏసియానెట్ ‌లో ఎడిటర్ ‌స్థాయికి వచ్చాను అంటే.. దానికి ప్రధాన కారణం ఈనాడులో ప్రతి రోజూ ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వం. మీరు ఏ పత్రిక, టీవీ, డిజిటల్ ఎడిషన్ తీసుకున్నా అక్కడ తప్పకుండా రామోజీరావు ‘బ్రాండెడ్’ జర్నలిస్టులు, టీం తప్పక ఉంటుంది. ఆయన కేవలం ఈనాడును మాత్రమే కాదు.. తన విలువైన మార్గదర్శకత్వంతో తెలుగు జర్నలిజం క్వాలిటీని చాలా ఎత్తుకు తీసుకెళ్లగలిగారు. వేల మంది పాత్రికేయ సైన్యాన్ని ఆయన సృష్టించగలిగారు.

click me!