
విదేశాల్లో ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ఐశ్వర్యరాణి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్)ను సంప్రదించారు. జర్మనీలో ఆరోగ్య రంగంలో ఉద్యోగాలకు భాషా నైపుణ్యం తప్పనిసరి కావడంతో టామ్‌కామ్ నిర్వహించిన జర్మన్ భాష శిక్షణలో చేరారు. ప్రాథమిక స్థాయి నుంచి క్రమంగా శిక్షణ పొందుతూ బీ2 (B2) స్థాయి వరకు జర్మన్ భాషలో ప్రావీణ్యం సాధించారు. భాషతో పాటు విదేశీ ఉద్యోగానికి అవసరమైన ఇతర ప్రక్రియలు, అర్హతలను కూడా విజయవంతంగా పూర్తి చేసి జర్మనీలో ఉద్యోగాన్ని దక్కించుకున్నారు.
జర్మనీలో ఫిజియోథెరపిస్టుగా ఎంపికైన ఐశ్వర్యరాణి నెలకు సుమారు రూ.3.5 లక్షల ప్రారంభ వేతనంతో ఉద్యోగంలో చేరనున్నారు. అక్కడ చేరిన తర్వాత స్థానిక నిబంధనల ప్రకారం అవసరమైన వృత్తిపరమైన శిక్షణ, గుర్తింపు ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ శిక్షణ పూర్తైన తర్వాత ఆమె వేతనం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆరోగ్య రంగంలో నైపుణ్యం కలిగిన నిపుణులకు జర్మనీలో భారీ డిమాండ్ ఉండటంతో భవిష్యత్తులో కెరీర్ పరంగా మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు) శాఖతో పాటు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ఐశ్వర్యరాణికి నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె పట్టుదల, కృషిని ప్రశంసించిన మంత్రి, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాన్ని సాధించడం రాష్ట్ర యువతకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ యువతకు దేశీయ అవకాశాలతో పాటు విదేశాల్లోనూ మెరుగైన ఉపాధి కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని యువతను అంతర్జాతీయ ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. టామ్‌కామ్ ద్వారా విదేశీ భాషల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. విద్యార్హతలతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలు, విదేశీ భాషలపై పట్టు సాధిస్తే ప్రపంచవ్యాప్తంగా మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలను పొందవచ్చని సూచించారు.
ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, ఐఏఎస్ కూడా ఐశ్వర్యరాణిని అభినందించారు. అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌లో వస్తున్న అవకాశాలను తెలంగాణ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టామ్‌కామ్ అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకుని సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విదేశాల్లో మంచి కెరీర్‌ను నిర్మించుకోవచ్చని చెప్పారు. ఐశ్వర్యరాణి సాధించిన విజయం విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే తెలంగాణ యువతకు స్ఫూర్తినిచ్చే ఉదాహరణగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టామ్‌కామ్ అధికారులు, ఐశ్వర్యరాణి కుటుంబ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.