
ఈ నేపథ్యంలో ఫెర్టిలిటీ చికిత్సల్లో పారదర్శకత, నైతిక ప్రమాణాలు, రోగుల హక్కులపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ హైదరాబాద్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సంస్థ ప్రత్యేక ప్యానెల్ చర్చను నిర్వహించింది. "బియాండ్ ఐవీఎఫ్: బిల్డింగ్ ట్రస్ట్, ఎథిక్స్ అండ్ అవేర్‌నెస్ ఇన్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART)" అనే అంశంపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫెర్టిలిటీ వైద్యులు, చట్ట నిపుణులు, పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొని రోగుల హక్కులు, ఏఆర్‌టీ చట్టం అమలు, నైతిక వైద్య సేవల ప్రాముఖ్యతపై చర్చించారు.
ప్యానెల్ సభ్యుల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు జంటల్లో ఒక జంట సంతానలేమి సమస్యను ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో తెలంగాణలో సంతానోత్పత్తి రేటు 1.5కు పడిపోవడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. ఈ పరిస్థితుల్లో ఫెర్టిలిటీ చికిత్సలు కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా ప్రజారోగ్య అంశంగా మారాయని నిపుణులు పేర్కొన్నారు. చికిత్స కోసం వచ్చే జంటలు నమోదు పొందిన (రిజిస్టర్డ్) ఫెర్టిలిటీ కేంద్రాలనే ఎంచుకోవాలని, ఏఆర్‌టీ చట్టం కింద తమకు ఉన్న హక్కులపై పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ క్లినికల్ డైరెక్టర్, ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ హిమ దీప్తి మోడరేటర్‌గా వ్యవహరించగా.. నోవా ఐవీఎఫ్ సీఈఓ శోభిత్ అగర్వాల్, సీనియర్ మెడికో-లీగల్ కన్సల్టెంట్ డాక్టర్ గీతేంద్ర శర్మ, సీనియర్ హెల్త్ జర్నలిస్టు, న్యూస్‌మీటర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కనిజా గరారీ పాల్గొన్నారు.
ఏఆర్‌టీ చట్టంపై ప్రతి రోగికి అవగాహన కల్పించాలి: ఏసీపీ మురళీకృష్ణ
హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ ఏసీపీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఐవీఎఫ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, కొందరు అక్రమ మార్గాలను అనుసరించడం వల్ల దుర్వినియోగాలకు అవకాశం ఏర్పడుతోందని తెలిపారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం-2021 కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
దేశంలోని అన్ని ఫెర్టిలిటీ కేంద్రాలు ఈ చట్టానికి సంబంధించిన వివరాలను తమ ఆసుపత్రుల్లో స్పష్టంగా ప్రదర్శించాలని, చికిత్స కోసం వచ్చే ప్రతి రోగికి చట్టం కల్పించే హక్కులు, రక్షణలపై అవగాహన కల్పించాలని సూచించారు. రోగులు సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకునేలా చేయడం వైద్య సంస్థల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సీఈఓ శోభిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఏఆర్‌టీ చట్టం ఫెర్టిలిటీ రంగంలో అవసరమైన నియంత్రణ వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు. అయితే చట్టం ఉండటమే కాకుండా రోగులు తమ హక్కులను తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ఫెర్టిలిటీ చికిత్సలకు సంబంధించిన పూర్తి సమాచారం, ఖర్చులు, విజయావకాశాలు, చికిత్స విధానం వంటి అంశాలను పారదర్శకంగా వెల్లడించాల్సిన బాధ్యత ప్రతి ఫెర్టిలిటీ కేంద్రంపైనా ఉందన్నారు.
అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, చట్ట అమలు యంత్రాంగం, మీడియా, వైద్య సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం చికిత్స అందించడం మాత్రమే కాదు.. రోగులను అవగాహన కలిగించడం కూడా తమ బాధ్యతేనని స్పష్టం చేశారు.
సీనియర్ మెడికో-లీగల్ నిపుణుడు డాక్టర్ గీతేంద్ర శర్మ మాట్లాడుతూ.. ఏఆర్‌టీ చట్టం రోగులకు పలు చట్టపరమైన రక్షణలను కల్పిస్తోందన్నారు. ఇందులో రోగి సమ్మతి, వ్యక్తిగత సమాచారం గోప్యత, పారదర్శక డాక్యుమెంటేషన్, క్లినిక్‌ల జవాబుదారీతనం వంటి అంశాలు కీలకమని వివరించారు. ఫెర్టిలిటీ చికిత్సలు అందించే వైద్యులు కూడా చట్టంలోని నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, చట్టం తెలియదనే కారణంతో బాధ్యత నుంచి తప్పించుకోలేరని చెప్పారు.
అదే సమయంలో సీనియర్ హెల్త్ జర్నలిస్టు కనిజా గరారీ మాట్లాడుతూ.. సంతానలేమికి సంబంధించిన అపోహలు, తప్పుడు ప్రచారాన్ని అరికట్టడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని అన్నారు. శాస్త్రీయ ఆధారాలతో ప్రజలకు సరైన సమాచారం అందించడం మీడియా బాధ్యత అని పేర్కొన్నారు.
క్లినిక్ ఏఆర్‌టీ చట్టం ప్రకారం రిజిస్టర్ అయిందో లేదో నిర్ధారించుకోండి. చికిత్స విధానం, ఖర్చు, విజయావకాశాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి. వైద్య, ఆర్థిక, మానసిక కౌన్సెలింగ్ తప్పనిసరిగా తీసుకోండి. ఇన్‌ఫార్మ్డ్ కన్సెంట్ పత్రాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే సంతకం చేయండి. గోప్యత, పారదర్శకత, నైతిక వైద్య సేవలు అందుతున్నాయో లేదో నిర్ధారించుకోండి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు దృష్ట్యా ఫెర్టిలిటీ సంరక్షణను ప్రజారోగ్య ప్రాధాన్యంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. రోగులకు సరైన అవగాహన కల్పించడం, ఏఆర్‌టీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయడం, నైతిక ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందించడం ద్వారా మాత్రమే ఫెర్టిలిటీ రంగంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయవచ్చని ప్యానెల్ సభ్యులు అభిప్రాయపడ్డారు.