
డయల్ 112 కేవలం పోలీసు సేవలకు మాత్రమే పరిమితం కాదు. పోలీసు, అంబులెన్స్, అగ్నిమాపక సేవలతో పాటు మొత్తం 18 రకాల అత్యవసర సేవలను ఒకే ప్లాట్ ఫామ్ పైకి తీసుకొచ్చారు. రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, నేర ఘటనలు, వైద్య అత్యవసర పరిస్థితులు, మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలు, విపత్తు నిర్వహణ వంటి సందర్భాల్లో ప్రజలు 112కు కాల్ చేస్తే సంబంధిత విభాగాలకు వెంటనే సమాచారం చేరుతుంది. దీంతో వేర్వేరు శాఖలకు వేర్వేరు నంబర్లకు కాల్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఈ వ్యవస్థను అత్యాధునిక సాంకేతికతతో రూపొందించారు. ఎవరైనా 112కు కాల్ చేసిన వెంటనే కాలర్ ఉన్న ప్రాంతాన్ని సిస్టమ్ ఆటోమేటిక్‌గా గుర్తించే విధంగా ఏర్పాటు చేశారు. ఆ సమాచారం ఆధారంగా సంఘటన స్థలానికి అత్యంత సమీపంలో ఉన్న పోలీసు సిబ్బంది, అంబులెన్స్ లేదా అగ్నిమాపక బృందాలను వెంటనే అప్రమత్తం చేస్తారు. దీనివల్ల స్పందన సమయం గణనీయంగా తగ్గి, అత్యవసర పరిస్థితుల్లో త్వరగా సహాయం అందించే అవకాశం ఉంటుంది. ఈ సేవలు ఏడాది పొడవునా 24 గంటలు అందుబాటులో ఉంటాయి.
డయల్ 112 అత్యవసర సేవల వ్యవస్థను ప్రారంభించిన సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, ఇది తెలంగాణలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే కీలక అడుగు అని అన్నారు. న్యాయ సహాయం, వైద్య సహాయం, సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు సహా అనేక అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవలు ఉపయోగపడతాయని తెలిపారు. 112కు వచ్చిన కాల్‌ను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని స్పష్టం చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా రెండు అంతస్తులను ఈ వ్యవస్థ నిర్వహణ కోసం కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ, కృత్రిమ మేథ (AI) ఆధారిత వ్యవస్థలను కూడా అత్యవసర సేవల్లో వినియోగించనున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్‌లో మరింత విస్తృతంగా ఉపయోగించి స్పందనను మరింత వేగవంతం చేయడమే లక్ష్యమని చెప్పారు.
డయల్ 112 అమల్లోకి రావడంతో అత్యవసర సమయంలో ఏ నంబర్‌కు కాల్ చేయాలనే అయోమయం ఉండదు. ఒకే నంబర్‌కు కాల్ చేస్తే అవసరాన్ని బట్టి పోలీసు, అంబులెన్స్, అగ్నిమాపక లేదా ఇతర అత్యవసర సేవలు సమన్వయంతో స్పందిస్తాయి. ప్రమాదాలు, నేరాలు లేదా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో విలువైన సమయం ఆదా అవుతుంది. దీంతో ప్రాణాలు, ఆస్తులను రక్షించే అవకాశాలు మరింత పెరుగుతాయి. ప్రజల్లో ఈ సేవలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ పోలీసు శాఖ విస్తృత ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టనుంది. సోషల్ మీడియా, ఇతర సమాచార ద్వారా డయల్ 112 వినియోగం, ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కొత్త వ్యవస్థతో తెలంగాణలో అత్యవసర సేవల స్పందన మరింత ఆధునికంగా, వేగవంతంగా మారనుంది.