తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు: సూత్రధారులు ఎవరు? కెసిఆర్ కి ఏం సంబంధం? కంప్లీట్ డీటైల్స్

By Rajesh Karampoori  |  First Published Apr 3, 2024, 7:25 AM IST

Phone Tapping: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలను కూడా సేకరించారు. అలాగే  అదుపులో ఉన్న ఆనాటి పోలీసు ఉన్నతాధికారులు కూడా తమ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను వెల్లడించారు.  అసలు ఈ ట్యాపింగ్ లో చిక్కుకునేది ఎవరు? వారిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి?


Telangana Phone Tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు కేవలం పోలీసు అధికారులపై ఫోకస్ చేసిన ప్రత్యేక విచారణ బృందం త్వరలోనే రాజకీయ నాయకుల వెంట పడబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు లను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. తమ వాంగ్మూలంలో బీఆర్ఎస్ సుప్రీం చెబితేనే ప్రత్యర్ధుల ఫోన్లు టాప్ చేశామని చెబుతున్నారు. ఇదే సమయంలో పలువురు రాజకీయ నేతలు తమ ఫోన్లను టాప్ చేశారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.  
  
ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమిటి?

గతంలో కె చంద్రశేఖర రావు (కేసీఆర్) నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పాలనలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌‌రెడ్డితో పాటు, ఇతర కాంగ్రెస్ నాయకులు, రియాల్టర్లు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు ఆరోపణల వస్తున్న నేపథ్యంలో ఈ కేసు తెరపైకి వచ్చింది.ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ పోలీసు ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశించింది. దీంతో అసలు విషయం బయటపడింది. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డితో సహా రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే..  అనుమతి లేకుండా ఇతర వ్యక్తుల ప్రైవసీని ఇబ్బంది పెట్టడం, చట్టవిరుద్ధంగా ఫోన్‌లను ట్యాప్ చేయడం, కంప్యూటర్ సిస్టమ్‌లు, అధికారిక డేటాను ధ్వంసం చేయడం వంటి ఆరోపణలతో ప్రణీత్ రావును మార్చి 13న అరెస్టు చేయడంతో ఈ స్కామ్ బయటపడింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.

Latest Videos

undefined

ఆరోపణలు ఏమిటి?

ఎస్‌ఐబీ అదనపు సూపరింటెండెంట్‌ ఫిర్యాదు మేరకు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తదితరులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నేరారోపణలలో వ్యక్తిగత గోప్యతను  ఉల్లంఘించడం, సాక్ష్యాలను అదృశ్యం చేయడం,నేరపూరిత కుట్ర వంటివి ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.  వీరు అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌‌రెడ్డితో పాటు, ఇతర కాంగ్రెస్ నాయకులు, రియాల్టర్లు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లుగా గుర్తించారు. అలాగే.. రియాల్టర్లు, వ్యాపారవేత్తల నుండి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. అదే సమయంలో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ , పేపర్ డాక్యుమెంట్‌లతో సహా వారి కార్యకలాపాలకు సంబంధించిన అన్ని ఆధారాలను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.  

ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు?

ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో 100,000 కంటే ఎక్కువ ఫోన్ కాల్స్ అక్రమంగా ట్యాప్ చేయబడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నాయకులు, రియాల్టర్లు, ప్రముఖ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది.  అలాగే.. సినీ, వ్యాపార ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేసి.. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు దోచుకున్నట్టు  ఆరోపణలున్నాయి.  

ఈ కేసులో ఎవరు చిక్కుకున్నారు?

ఈ స్కామ్ లో ప్రధానంగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి ప్రభాకర్‌రావు, సస్పెండ్‌కు గురైన డిఎస్పీ డి ప్రణీత్‌రావు, కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డిసిపి పి రాధాకృష్ణ, తెలుగు టీవీ ఛానల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉన్నారు. ఈ కేసులో  A1గా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ప్రభాకర్ రావు పై లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. వాస్తవానికి ప్రభాకర్‌ రావు అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స తీసకుంటున్నారు. అయితే, ట్రీట్‌మెంట్ ఇంకా మరో మూడు నెలల పాటు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. 

అలాగే..  అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు గతంలో అరెస్టయిన సస్పెండ్‌కు గురైన డీఎస్పీ డి.ప్రణీత్‌రావుతో బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.  అరెస్టయిన అధికారులు ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ పర్యవేక్షణ, సాక్ష్యాలను నాశనం చేయడంతో సహా వివిధ నేరాలలో ప్రమేయం ఉన్నట్లు అంగీకరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ వ్యవహరంలో ఎవరెవరి  ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయా అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. అదేవిధంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నేతల కదలికపై కూడా పోలీసులు ఓ కన్నేసినట్లుగా తెలుస్తోంది.

click me!