రాములమ్మకు పదవొచ్చిందోచ్

By rajesh yFirst Published Sep 19, 2018, 8:25 PM IST
Highlights

తనకు ఎలాంటి గుర్తింపు ఉండటం లేదని ఆరోపిస్తూ నాలుగున్నరేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న రాములమ్మకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ కమిటీలో స్థానం కల్పించింది.  పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయశాంతిని స్టార్ కాంపెయినర్, ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా నియమించింది. 
 

హైదరాబాద్: తనకు ఎలాంటి గుర్తింపు ఉండటం లేదని ఆరోపిస్తూ నాలుగున్నరేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న రాములమ్మకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ కమిటీలో స్థానం కల్పించింది.  పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయశాంతిని స్టార్ కాంపెయినర్, ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా నియమించింది. 

2014 ఎన్నికల అనంతరం రాములమ్మ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కనీసం రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన సందర్భంలోనూ ఆమె అజ్ఞాత వాసం వీడలేదు. రాహుల్ గాంధీని కలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. అంతేకాదు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఎన్నికల అనంతరం గాంధీభవన్ మెట్లెక్కలేదని ఆ పార్టీ నేతలే చెప్తారు.  

అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో కూడా ఆమె అజ్ఞాత వాసం వీడకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెసు పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాములమ్మ త్వరలోనే రాహుల్ గాంధీని కలుస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ పని కూడా చెయ్యకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాములమ్మను బుజ్జగించే పనిలో పడింది. 

ఆమెను బుజ్జగించేందుకు అధిష్టానం తరఫున బోసు రాజు, శ్రీనివాసన్ రంగంలోకి దిగారు. వారిద్దరు విజయశాంతితో భేటీ అయ్యారు. అనంతరం కాగ్రెస్ పార్టీ ప్రకటించిన వివిధ కమిటీల్లో విజయశాంతికి స్టార్ కాంపెయినర్, ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు పదవులను కట్టబెట్టారు. 

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి విజయశాంతి సేవలను వినియోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే స్టార్ కాంపెయినర్ అని ప్రకటించింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో సానుభూతి ఉందని అందుకు నటి విజయశాంతి ప్రచారం తోడైతే పార్టీ గెలుపుకు ఎంతోదోహదపడుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. 

మరోవైపు స్టార్ కాంపెయినర్, ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు పదవులను కట్టబెట్టడంతో ఆమె మహాకూటమి తరపున ప్రచారం చేస్తారా లేక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నచోట మాత్రమే ప్రచారం చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటున్న రాములమ్మ టీడీపీ అభ్యర్థులు నిలబడినచోట కాంపెయిన్ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.   

సంబంధిత వార్తలు

రంగంలోకి దిగిన అధిష్టానం: విజయశాంతికి బుజ్జగింపులు

టీడీపితో పొత్తుపై అసంతృప్తి: సాయంత్రం ఢిల్లీకి రాములమ్మ

రాములమ్మ అలిగారట ఎందుకంటే..

బాబుపై గరం: టీడీపితో పొత్తును వ్యతిరేకిస్తున్న రాములమ్మ

లాల్ దర్వాజ కాడ బోనమెత్తిన విజయశాంతి (ఫొటోలు)


 

click me!