నిన్న అమృత, నేడు మాధవి: తండ్రులకు ఎందుకీ అసహనం?

By rajesh yFirst Published Sep 19, 2018, 7:44 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటన మరువకముందే అలాంటి ఘటన హైదరాబాద్ లోనూ చోటు చేసుకుంది. ఎస్ఆర్ నగర్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై అమ్మాయి తండ్రి వేటకొడవలితో తెగనరికాడు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటన మరువకముందే అలాంటి ఘటన హైదరాబాద్ లోనూ చోటు చేసుకుంది. ఎస్ఆర్ నగర్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై అమ్మాయి తండ్రి వేటకొడవలితో తెగనరికాడు. అల్లుడు, కుమార్తెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. అల్లుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.

ఇకపోతే మిర్యాలగూడలో ప్రణయ్, అమృత వర్షిణిల హత్య, ఎస్ఆర్ నగర్ లో మాధవి-సందీప్ ల హత్యలకు దగ్గర పోలిక ఉంది. రెండు హత్యల్లో కత్తి దూసింది కులమే. రెండు చోట్ల విలవిలలాడింది ప్రేమజంటలే.  రెండు ప్రేమ జంటల్లో అమ్మాయి అగ్రవర్ణాలకు చెందినవారు కాగా అబ్బాయిలు దళిత వర్గానికి చెందిన వారు కావడం. రెండు ఘటనల్లోనూ నిందితుడు అమ్మాయి తండ్రే. హత్య చెయ్యాలనుకుంది అల్లుడినే. 

మిర్యాలగూడలో అమృత వర్షిణి కోమటి సామాజిక వర్గానికి చెందిన యువతి. ప్రణయ్ ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన యువకుడు. ఇద్దరూ తొమ్మిదో తరగతి నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను అమృతవర్షిణి తల్లిదండ్రులు, బాబాయి శ్రవణ్ లు అంగీకరించలేదు. అమృత వర్షిణిని మరచిపోవాలంటూ పలుమార్లు ప్రణయ్ కు వార్నింగ్ లు సైతం ఇచ్చారు మారుతీరావు. 

మారుతీరావు అతని సోదరుడు శ్రవణ్ బెదిరింపులకు భయపడలేదు అమృతవర్షిణి, ప్రణయ్ లు. ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్ లోని ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు. పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కావాలని కోరారు. ఆర్య సమాజ్ లో కొంతమంది సమక్షంలోనే వివాహం చేసుకోవడంతో ప్రణయ్ కుటుంబ సభ్యులు గ్రాండ్ గా వివాహ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే తన కుమార్తె అమృతవర్షిణి తనకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుసుకుందని కక్ష కట్టిన మారుతీరావు ప్రణయ్ హత్యకు ప్లాన్ వేశాడు. 

మిర్యాలగూడలో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మారుతీరావు సుఫారీ గ్యాంగ్ ను రంగంలోకి దింపాడు. కోటి రూపాయల డీల్ కుదుర్చుకుని ఈనెల 14న ప్రణయ్ ను హత్య చేయించాడు. 6నెల గర్భిణీ కావడంతో అమృత వర్షిణిని జ్యోతి నర్సింగ్ హోం లో వైద్య పరీక్షల కోసం తీసుకువచ్చిన ప్రణయ్ పరీక్షల అనంతరం తిరిగి వెళ్తుండగా సుఫారీ కిల్లర్ శర్మ అత్యంత కర్కశంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. 

నిమిషాల్లోనే ప్రణయ్ చనిపోయాడు. కళ్లెదుటే ప్రణయ్ హత్యకు గురవ్వడంతో అమృతవర్షిణి కుప్పకూలిపోయింది. తనతో జీవితాంతం ఉంటాడనుకున్న వ్యక్తిని అర్థాంతరంగా చంపించి వేయడంతో షాక్ కు గురైంది.

అటు ఎస్ ఆర్ నగర్ లో జరిగిన హత్య కూడా అలాంటిదే. మాధవి విశ్వబ్రహ్మణ సామాజిక వర్గం కాగా, సందీప్ ది ఎస్సీ మాల సామాజిక వర్గం. ఇద్దరు పదో తరగతి నుంచే ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలుసు. కానీ మాధవిని మేనమామకు ఇచ్చి వివాహం చేయాలని తండ్రి మనోహరాచారి, మరియు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అయితే మాధవికి మాత్రం మేనమామను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. 

దీంతో సెప్టెంబర్ 12న అంటే వారం రోజుల క్రితం సందీప్, మాధవిలు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులు సైతం ఇరుకుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చాయి. కౌన్సిలింగ్ తర్వాత మాధవిని తీసుకుని సందీప్ తన ఇంటికి వెళ్లిపోయాడు. పెళ్లి మనకు తెలియకుండా జరిగిపోయింది కాబట్టి రిసెప్షన్ ఘనంగా ఏర్పాటు చేద్దామంటూ మాధవి తండ్రి పోలీసుల ఎదుట బిల్డప్ లు సైతం ఇచ్చారు. 

అయితే తండ్రి మాటలను మాధవి గమనిస్తూనే ఉంది. తండ్రి హృదయం నుంచి వస్తున్న మాటలు కావని పసిగట్టింది. అందుకే వివాహం అనంతరం ఇంటికి రమ్మని పిలిచినా వెళ్లలేదు. మాధవి, సందీప్ లను విడదీసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా వాటిని తిప్పికొట్టింది. ఇంటికి రావాలని కుటుంబసభ్యులు ఒత్తిడి తెచ్చినా మాధవి మాత్రం  తల్లిదండ్రులతో వెళ్లేందుకు ఇష్టపడలేదు.

కుమార్తెలో మార్పు రాకపోవడంతో మంచిగా నటిస్తూ సందీప్ కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు మాధవి తండ్రి మనోహరచారి. తన కూతురును బాగా చూసుకోవాలని సందీప్ తో పాటు అతని కుటుంబ సభ్యులను కోరారు. తమ కూతురులానే మాధవిని చూసుకొంటున్నామని సందీప్ కుటుంబసభ్యులు చెప్పారు. 

అయితే  బుధవారం తన కూతురును ఒక్కసారి చూడాలని ఉందని సందీప్ కు మనోహరచారి ఫోన్ చేశాడు. అంతేకాదు నవ దంపతులకు బట్టలు కూడా పెడతానని చెప్పాడు. తండ్రి మాటలు నమ్మిన మాధవి, మామ మాటలు నమ్మిన సందీప్ ఇప్పుడే వస్తామని ఇంట్లో చెప్పి ఎస్ఆర్ నగర్ బండ్ల గూడ చౌరస్తాకు వచ్చారు. బండి పార్క్ చేస్తుండగా, మనోహరచారి కూడా వారి బైక్ పక్కనే బైక్ పార్క్ చేశాడు.  

బైక్ పార్క్ చేశాడో లేదో ఒక్కసారిగా కొడవలితో సందీప్ పై దాడికి పాల్పడ్డాడు. తండ్రి కర్కసత్వాన్ని కళ్లారా చూసిన మాధవి తన భర్తను కాపాడుకునే ప్రయత్నం చేసింది. తన భర్తను ఏం చేయోద్దంటూ అడ్డువచ్చింది. అడ్డువచ్చిన మాధవిని సైతం మనోహరచారి వదల్లేదు. ఆవేశంతో ఊగిపోతూ కుమార్తెపైనా విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో మాధవి తీవ్ర గాయాలపాలైంది. 

మెడ దగ్గర మెదడుకు వెళ్లే నరాలు తెగిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అంతేకాదు ఎడమ చెయ్యి సైతం దాదాపుగా సగం వరకు తెగిపోయింది. ప్రస్తుతం నవ దంపతులు  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు అమృత తండ్రి మారుతీరావు సుఫారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయిస్తే ఎస్ఆర్ నగర్ ఘటనలో మాత్రం మనోహరాచారి తానే స్వయంగా కొడవలితో హత్య దాడికి పాల్పడ్డాడు. 

తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో అమ్మాయి తండ్రులు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇలా ప్రాణాలు తీసి ఏం సాధిస్తారని సమాజం ప్రశ్నిస్తోంది. కూతురుకు ఏమీ కాకూడదని పెళ్లి చేసుకున్న యువకుడినే హత్య చెయ్యాలని భావిస్తున్న తండ్రులు ఏమి సాధించారు. అమృత భర్తను చంపి ఆమె నూరేళ్ల జీవితాన్ని నాశనం చేశాడు మారుతీరావు.

ఆమె కన్నకలలను ఆశలను బతికుండగానే సజీవ సమాధి చేశారు. ఇకపోతే ఎస్ఆర్ నగర్ విషయానికి వస్తే సందీప్ ను హతమార్చి తమ కుమార్తెను తీసుకువెళ్లిపోదామనుకున్న మనోహరచారి ఏం సాధించారు. తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను కొడవలితో నరికేశాడు. ఆస్పత్రిపాల్జేశాడు. ప్రస్తుతం మాధవి అపస్మారక స్థితిలో ఉంది.    

click me!