ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?

Published : Sep 01, 2026, 09:45 PM IST
Telangana

సారాంశం

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు ఢిల్లీకి చేరాయి. రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు వరుసగా హస్తిన బాట పట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ప్రభుత్వ పాలన, పార్టీ వ్యవహారాలు, నేతల మధ్య నెలకొన్న విభేదాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మంత్రి కొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు కూడా హస్తిన పర్యటనకు వెళ్లిన‌ట్లు స‌మాచారం. దీంతో ఒకే సమయంలో తెలంగాణకు చెందిన పలువురు కీలక నేతలు ఢిల్లీలో ఉండటం కాంగ్రెస్‌ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. పార్టీలో నెలకొన్న పరిస్థితులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో సమన్వయం పెంచేందుకు అధిష్టానం ఎలాంటి సూచనలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

కేబినెట్‌ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు

తెలంగాణ మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీ అంశం కూడా ఈ ఢిల్లీ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అవసరమైతే కేబినెట్‌ విస్తరణతో పాటు కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలన్న ఆలోచనపై కూడా అధిష్టానం పరిశీలన జరుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక నామినేటెడ్‌ పదవుల భర్తీ, జిల్లాల వారీగా రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి. రానున్న‌ రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఎలాంటి మార్పులు అవసరమనే అంశంపై రాష్ట్ర నాయకత్వంతో అధిష్టానం చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న భేటీలన్నీ కేవలం మంత్రివర్గ మార్పులకే పరిమితం కావని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, నేతల మధ్య సమన్వయం వంటి అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొండా సురేఖ వ్యవహారంపై అధిష్టానం ఏం చేస్తుంది?

ఇటీవల మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం. సుస్మిత వ్యాఖ్యల విషయంలో కొండా సురేఖ దంపతుల స్పందనపై కూడా పార్టీలో కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో క్రమశిక్షణ అంశాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించవచ్చనే ప్రచారం మొదలైంది.

ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొన్ని అంశాలపై రిపోర్టు సమర్పించినట్లు సమాచారం. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వైఖరిపై కూడా కమిటీ రిపోర్టులో ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించిన నేతల విషయంలో ఏం చేయాలనే దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొండా సురేఖ విషయంలో కఠిన చర్య తీసుకోవాలన్న అభిప్రాయం కొందరు నేతల నుంచి వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం చర్చల తర్వాతే వెలువడనుంది.

రెబల్స్‌పై చర్యలా.. ప్రక్షాళనకు శ్రీకారం చుడతారా?

రాష్ట్ర కాంగ్రెస్‌లో బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతల విషయంలోనూ ఢిల్లీ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. గత కొన్ని రోజులుగా పార్టీలోని కొందరు సీనియర్లు సీఎం రేవంత్‌ రెడ్డితో తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని కొందరు నేతలు ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. అదే సమయంలో అంతర్గత సమస్యలను పరిష్కరించకుండా వదిలేస్తే ప్రతిపక్షాలకు రాజకీయంగా ఉపయోగపడే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రెబల్‌ స్వరాలు వినిపిస్తున్న నేతలపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా? లేక రాజకీయంగా సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరిస్తారా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఒకవేళ కఠిన చర్యలు తీసుకుంటే కొండా సురేఖతో పాటు మరికొందరు నేతలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే కొందరిని తప్పించి కొత్త ముఖాలకు అవకాశం కల్పించవచ్చనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలే తప్ప అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

అభివృద్ధి ఎజెండాతో ఢిల్లీకి సీఎం.. రాజకీయ భేటీలపైనా దృష్టి

రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనకు రాజకీయ అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుల విస్తరణ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే డిసెంబరులో నిర్వహించనున్న ‘రైజింగ్‌ తెలంగాణ-2’ పెట్టుబడుల సదస్సు గురించి కూడా కేంద్రంతో చర్చించనున్నారు.

వరంగల్‌ మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనుల పురోగతిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడితో సమావేశం కానున్నట్లు సమాచారం. రక్షణ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోనూ చర్చించే అవకాశం ఉంది.

డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ సదస్సులో డిఫెన్స్‌ రంగానికి చెందిన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలపై కూడా సీఎం కేంద్ర పెద్దలతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

అధికారికంగా చూస్తే రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, కేంద్ర సహకారం వంటి అంశాలే పర్యటనలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే ఢిల్లీకి ఒకేసారి తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన పలువురు కీలక నేతలు చేరుకోవడంతో పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా అధిష్టానం దృష్టి సారించనుందనే చర్చ జోరందుకుంది. దీంతో రేవంత్‌ రెడ్డి పర్యటన ముగిసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి రాజకీయ నిర్ణయాలు వెలువడతాయన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం