
అంజయ్యనగర్‌లోని నాలా సమీపంలో సుమారు 50 గజాల స్థలంలో నిర్మాణంలో ఉన్న భవనం శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగి కుప్పకూలింది. శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో దాని గోడలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఇద్దరు వృద్ధులకు గాయాలయ్యాయి. మరో వ్యక్తి రమణారెడ్డి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనం సమీపంలో ఉన్న హాస్టల్‌లోని విద్యార్థులు కూడా ప్రమాదాన్ని గమనించి భయంతో బయటకు పరుగులు తీశారు.
భవనం కూలిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద మరెవరైనా చిక్కుకుని ఉన్నారా అనే అనుమానంతో ప్రత్యేక పరికరాలతో గాలింపు చేపట్టారు. రీజనల్ ఫైర్ ఆఫీసర్ సుధాకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ సాయంతో శిథిలాల కింద ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వారి మృతదేహాలను బయటకు తీసి పోలీసులకు అప్పగించారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేశ్ కారే (34), మహబత్ (42)గా గుర్తించినట్లు సమాచారం. ఉదయం భవనంలో పనులు చేసేందుకు ఇద్దరు కార్మికులు వచ్చినట్లు స్థానికులు చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఎవరైనా శిథిలాల్లో ఉన్నారా అనే కోణంలో తనిఖీలు కొనసాగించారు.
హైదరాబాద్ మాదాపూర్ అంజయ్య నగర్ లో నిర్మాణంలో ఉన్న భారీ భవనం కుప్పకూలింది. నాలాను అనుకుని ఏడు అంతస్తులతో నిర్మిస్తున్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పక్కనే ఉన్న నిర్మాణాలు కూడా సైతం పాక్షికంగా కూలిపోయాయి. కేవలం 50గజాల స్థలం లో చేపట్టిన ఈ అక్రమ నిర్మాణం ఒంటి గంట సమయంలో… pic.twitter.com/KQWfInwBJd
— V Chandramouli (@VChandramouli6) August 22, 2026
భవన నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకోలేదని అధికారులు గుర్తించినట్లు సమాచారం. గతంలోనే టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి నిర్మాణదారులకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పనులు కొనసాగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్కువ వ్యవధిలోనే భారీ భవనాన్ని నిర్మించడంతోనే ఈ దుస్థితి వచ్చిందని వారు చెబుతున్నారు. భవన నిర్మాణానికి సంబంధించి ఖాజా, సాజిద్ పేర్లు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు సమాచారం.
అంజయ్యనగర్‌లో అక్రమ, ప్రమాదకర నిర్మాణాలపై గతంలోనూ ఫిర్యాదులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ భవనం నిర్మాణంపై పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఐదు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిన ఘటన కూడా జరిగింది.ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, సీఎంసీ కమిషనర్ సృజన పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలు, భవనం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. సాయంత్రం వేళ ప్రమాదం జరిగి ఉంటే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.