
Hyderabad : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ''నేను, నా ముసల్ది'' అని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మొత్తం తన కుటుంబాన్ని రంగంలోకి దించి రాష్ట్రాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. కల్వకుంట కుటుంబం గుంపు మందలా జమై మంది సొమ్ము తిన్నారు... ఇప్పటికీ తింటున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయ్యింది... ఇన్నిరోజులు కేసీఆర్ విధులకు హాజరుకాకుండానే ఏకంగా రూ.12400000 జీతం తీసుకున్నాడని రేవంత్ తెలిపారు.
ఫామ్ హౌస్ వీడి బయటకురాని మాజీ ముఖ్యమంత్రి కోసం ఈ ప్రభుత్వం కూడా భారీగా ఖర్చుచేయాల్సి వస్తోందన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.22 కోట్లు ఖర్చు చేసిందని సీఎం తెలిపారు. రాజకీయాల్లో ఉండి కనీసం ప్రజలకోసం బయటకురాని నాయకుడిని ఈయననే చూస్తున్నామని అన్నారు.
ఎవరైనా ఉద్యోగి పని చేయకుండానే జీతం తీసుకుంటాను అంటే కుదరదు... వారిని తీసి పక్కనబెడతారు... కేసీఆర్ విషయంలోనూ ఇదే చేయాలన్నారు రేవంత్. అందుకే సెప్టెంబర్ 1 నుండి 6 వరకు అంటే ఈ వారమంతా కేసీఆర్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనలు తెలియజేయాలని రేవంత్ పిలుపునిచ్చారు... మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. కేసీఆర్ రాజీనామా చేసేవరకు ఉద్యమించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
తెలంగాణ ప్రభుత్వం మూసీ నదిపై మరో బ్రిడ్జిని నిర్మించింది. అంబర్ పేట, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాలను కలుపుతూ మూసారాంబాగ్ వద్ద రూ.52 కోట్ల వ్యయంతో 400 మీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మించారు... ఈ హైలెవల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మూసీలో లక్షా యాభై వేల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బంది తలెత్తకుండా ఈ బ్రిడ్జిని నిర్మించారు.
మూసారాంబాగ్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా అంబర్‌పేట మున్సిపల్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఇందులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ మాజీ సీఎం కేసీఆర్, గత బిఆర్ఎస్ గవర్నమెంట్ పై సీరియస్ అయ్యారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం ఎలా దివాళా తీయించిందో వివరిస్తూనే, తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచారు. తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీపడుతూ విశ్వనగరంగా ఎదిగిందని... విద్య, ఉద్యోగ, ఐటీ, సినిమా రంగాలకు అపార అవకాశాలను కల్పించిందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను పెంచుకోవడంలో గత ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. తమ ప్రభుత్వం తెలంగాణను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తోందని చెబుతూ, రాష్ట్రాన్ని క్యూర్ (సర్వీస్ సెక్టార్), ప్యూర్ (మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్), రేర్ (అగ్రికల్చర్ సెక్టార్) అని మూడు రకాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
ఈ సందర్భంగా అంబర్‌పేట నియోజకవర్గం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఒకవైపు మూసీ మురికి, మరోవైపు వరదల సమస్యలు ఈ నియోజకవర్గాన్ని ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. గత పదేళ్ల పాలకులు పట్టించుకోని మూసారాంబాగ్ బ్రిడ్జిని తమ ప్రభుత్వం రెండేళ్లలోనే పూర్తి చేసి ప్రారంభించిందని గుర్తు చేశారు. గత పాలకులు పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేశారని, కట్టిన కొద్ది ఇళ్లను కూడా దళారులకు ఇచ్చారని ధ్వజమెత్తారు. ఎక్కడి వారికి అక్కడే ఇళ్లు కట్టిస్తే ప్రయోజనం ఉంటుంది.. అందుకే అంబర్‌పేటలో పదెకరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని సీఎం ప్రకటించారు.
బతుకమ్మ కుంట ఆక్రమణలను ప్రస్తావిస్తూ గతంలో హెలికాప్టర్లలో పూలు చల్లిన నాయకులు దానిని నాశనం చేస్తే, తమ ప్రభుత్వం పునరుద్ధరించిందన్నారు. ఇప్పుడు ఎండాకాలంలో కూడా నీళ్లు ఉన్నాయని తెలిపారు. బతుకమ్మ కుంటను ఆక్రమించుకోవాలని చూస్తున్న వారికి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారో ప్రజలు ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బిఆర్ఎస్ పెద్దల కనుసన్నల్లో బతుకమ్మకుంట కబ్జాకు గురయితే వారి చెరనుండి విడిపించామన్నారు.
2023 డిసెంబర్ 7న తాను ప్రమాణ స్వీకారం చేసి సచివాలయానికి వెళ్లినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాళా తీసిందని అధికారులు చెప్పారని సీఎం రేవంత్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 16 వేల కోట్ల మిగులుతో తెలంగాణను అప్పగిస్తే... కేసీఆర్ కుటుంబం తొమ్మిదిన్నర ఏళ్లలో రాష్ట్రంపై 8 లక్షల 11 వేల కోట్ల అప్పుల భారం మోపిందని తీవ్రంగా విమర్శించారు. 60 ఏళ్లలో 16 మంది ముఖ్యమంత్రులు 70 వేల కోట్ల అప్పు చేస్తే, కేసీఆర్ ఒక్కరే ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేశారని... దీంతో నెలకు 7,500 కోట్ల అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు, పింఛన్లు ఇవ్వలేని స్థితి నుంచి ఇప్పుడు ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 5వ తేదీ లోపు జీతాలు చెల్లిస్తున్నామని, గతంలో నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని గుర్తు చేశారు.
గత ప్రభుత్వం పెట్టిపోయిన 8 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిల్లో 6 వేల కోట్లను రెండు నెలల్లోనే విడుదల చేశామని, ఆరోగ్య భద్రత కార్డులను పునరుద్ధరించామని సీఎం తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు 60 మంది చనిపోయినా పట్టించుకోని గత పాలకులకు భిన్నంగా, తమ ప్రభుత్వం ఆర్టీసీకి 32 నెలల్లో 11 వేల కోట్లు చెల్లించిందని, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోందని అన్నారు.
విధ్వంసమైన తెలంగాణను విద్య, ఉద్యోగ రంగాల్లో పునర్నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని.. మౌలిక సదుపాయాలు పెంచడం వల్ల ప్రభుత్వ స్కూళ్లలో లక్ష అడ్మిషన్లు పెరిగి 'నో అడ్మిషన్' బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. విద్యా రంగంలో 28వ స్థానంలో ఉన్న తెలంగాణను 18వ స్థానానికి తీసుకువచ్చామని చెప్పారు.
గత పదేళ్లలో నియామకాలు చేపట్టకుండా ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారికి భిన్నంగా తమ 1000 రోజుల పాలనలో 72 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రకటించారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చుతున్నామని అన్నారు. స్కిల్స్ ఆండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. రైతు సంక్షేమం కోసం 1000 రోజుల్లో 1.70 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేశామని, కోహెడలో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం ఇచ్చిన నాసిరకం బతుకమ్మ చీరలను కమిషన్ల కోసం ఇచ్చారని, అవి పిట్టలను బెదిరించడానికి మాత్రమే పనికొచ్చాయని సీఎం విమర్శించారు. తమ ప్రభుత్వం కోటి మంది మహిళలకు నాణ్యమైన ఇందిరమ్మ చీరలను అందించిందని... ఇందుకోసం మహిళలు తనను ఆశీర్వదిస్తున్నారని అన్నారు. మహిళా సంఘాలకు 2,100 కోట్లు వడ్డీ కింద చెల్లించామని, వారికి 1,000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చేసి మహిళలను యజమానులను చేశామని తెలిపారు. మహిళలకు ప్రభుత్వ భూములు ఇచ్చి పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయిస్తున్నామని, హైటెక్ సిటీ పక్కన వారి ఉత్పత్తుల విక్రయం కోసం 1,000 కోట్ల విలువైన మూడున్నర ఎకరాల్లో 'ఇందిరా మహిళా శక్తి స్టాల్స్' ఏర్పాటు చేశామని వివరించారు.
ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతోనే ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. అలాగే 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల మందికి ఆరు కిలోల సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో పేదల ఆత్మగౌరవం కోసం లక్ష ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నామని, సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,500 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు.
కొత్త ఉస్మానియా ఆస్పత్రిని 2,000 కోట్లతో నిర్మిస్తున్నామని, త్వరలో ఎల్‌బీ నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభిస్తామని వెల్లడించారు. వివిధ ఆస్పత్రులకు కొండా లక్ష్మణ్, ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహానుభావుల పేర్లు పెడుతున్నామని తెలిపారు. సచివాలయం ముందు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని, నెక్లెస్ రోడ్డులో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మను, చాకలి ఐలమ్మ మనవరాలిని మహిళా కమిషన్ సభ్యురాళ్లుగా చేసి సామాజిక న్యాయం పాటించామని వివరించారు.
తనకు, కేసీఆర్‌కు పోలిక లేదని... కేసీఆర్ తన కుటుంబాన్ని పదవుల్లో కూర్చోబెడితే, తాను సామాన్య కార్యకర్తలను, బలహీన వర్గాల బిడ్డలను మంత్రులుగా, పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీలుగా చేశానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించామని, 100 ఏళ్ల తర్వాత తెలంగాణలో బీసీ కులగణన చేసి మోదీకి సవాల్ విసిరామని తెలిపారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ 1000 రోజుల్లో ఒక్కరోజైనా పేదల కోసం పనిచేశారా అని ప్రశ్నించారు. జీతం తీసుకుంటూ పనిచేయని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 6న ఇందిరా పార్క్ వద్ద నిరసనలు తెలియజేస్తామని, 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ దీనిపై చర్చిస్తామని తెలిపారు. పదేళ్లలో కేసీఆర్ ఏం చేశాడో, 1000 రోజుల్లో తాను ఏం చేశానో అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.