ఎన్‌పీఆర్‌లో ఆ కాలమ్ ప్రమాదకరం... తీసేయాల్సిందే: భట్టి విక్రమార్క

By Siva KodatiFirst Published Mar 16, 2020, 3:26 PM IST
Highlights

తెలంగాణ శాసనసభలో ఎన్‌పీఆర్‌పై విచారణ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఎన్‌పీఆర్‌ వల్ల ఉత్పన్నమవుతున్న పరిణామాలను కేసీఆర్ దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చారని అన్నారు

తెలంగాణ శాసనసభలో ఎన్‌పీఆర్‌పై విచారణ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఎన్‌పీఆర్‌ వల్ల ఉత్పన్నమవుతున్న పరిణామాలను కేసీఆర్ దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చారని అన్నారు.

సమస్య పరిష్కారం కోసం అందరం ఏకం కావాలని..  దీనిలో భాగంగానే ఎన్‌పీఆర్‌పై ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నట్లు భట్టి స్పష్టం చేశారు. దేశంలో ఎన్నో కులాలు, మతాల ప్రజలు జీవిస్తున్నారని, ఎంతోమంది ప్రజా ప్రతినిధులకు కూడా బర్త్ సర్టిఫికేట్లు లేవన్నారు.

Also Read:దేశ ద్రోహులమౌతామా ?.. సీఏఏ పై అసెంబ్లీలో కేసీఆర్

ప్రజా ప్రతినిధుల పరిస్ధితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్ధితి ఏంటని విక్రమార్క ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో చాలా మందికి జనన ధ్రువీకరణ పత్రాలు లేవని, ప్రమాదకరమైన ఎన్‌పీఆర్‌ను కేంద్రం తీసుకొచ్చిందని మండిపడ్డారు.

పౌరసత్వ సవరణ చట్టం దేశంలో ఉన్న అన్ని మతాల వారికీ సంబంధించిన సమస్య అన్న భట్టి విక్రమార్క.. చొరబాటుదారులను దేశంలోకి అనుమతించాలని ఎవరూ చెప్పరని స్పష్టం చేశారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read:కరోనాపై అతిగాళ్లు అతి చేస్తున్నారు: మీడియాకు కేసీఆర్ వార్నింగ్

తీర్మానం చేయడంతోనే సరిపెట్టుకోకుండా తెలంగాణలో దీనిని అమలు చేయబోమని చట్టం తీసుకురావాలని ఆయన భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రప్రభుత్వం మనం చేసిన తీర్మానం పరిగణనలోకి తీసుకుని ఎన్‌పీఆర్‌లో ఆ కాలమ్‌ను తొలిగించాలని భట్టి డిమాండ్ చేశారు. 

ఎన్‌పీఆర్‌ను 2010లో చేపట్టినా దానిలో తల్లిదండ్రుల పుట్టుకకు సంబంధించిన వివరాలను సేకరించలేదని.. కానీ ఎన్‌పీఆర్-2020లో మాత్రం తల్లిదండ్రులు జనన వివరాలు అడిగే కాలమ్ పెట్టడం ప్రమాదకరమని విక్రమార్క అన్నారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌పీఆర్‌ను వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. 

click me!