ఐపిఎస్ లు చాలా మందే ఉంటారు.. ఈమె చాలా మందికి భిన్నం

By sivanagaprasad kodatiFirst Published Oct 16, 2018, 12:13 PM IST
Highlights

నిజాయితీ, అంకితభావం, సేవ చేయాలనే తపనతో పాటు ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వర్తిస్తూ ఎంతోమంది అధికారులు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తెలంగాణలో ఓ స్మితా సబర్వాల్, ఓ ఆమ్రపాలి జనం చేత శెభాష్ అనిపించుకుంటున్నారు. 

ఐపీఎస్ అధికారి.. అఖిల భారత సర్వీసు ఉద్యోగాల్లో ఐఏఎస్ తర్వాతి స్థానం దానిదే.. ఆ హోదాలో ఉండే వారికి అధికారం, సంపాదన, హోదా ఉంటుంది.. లక్షల్లో జీతాలతో పాటు అధికారం మాటున అక్రమార్జన, బలవంతపు వసూళ్లు, సెటిల్ మెంట్లు కూడా ఉంటాయని జనాలు అనుకునే మాట.

దీనికి తోడు వాళ్లు ప్రజలతో కర్కశంగా ఉంటారని ఏనాటి నుంచో ఉన్న పేరు. అలాగే కొత్తగా విధుల్లోకి వచ్చే ఐపీఎస్ అధికారులు సర్వీసులోకి వచ్చిన కొత్తల్లో వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, అక్రమార్కుల గుండెల్లో రైల్లు పరిగెత్తించాలని అనుకుంటారు. మూడు, నాలుగేళ్లు కథ బాగానే నడిచినప్పటికీ తర్వాత రాజకీయ ఒత్తిళ్లకు అలవాటు పడిపడి మారిపోతారని డిపార్ట్‌మెంట్‌లో వినిపించే మాట.

కానీ సర్వీసులోకి అడుగుపెట్టి పదేళ్లు కావొస్తున్నా అదే క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావంతో ప్రజలకు సేవ చేస్తూ.. ఐపీఎస్‌లు అంటే ఇలా కూడా ఉంటారా అని శెభాష్ అనిపించుకుంటున్నారు చందన దీప్తి ఐపీఎస్. 2012 ఏపీ క్యాడర్‌కు చెందిన ఈ అచ్చ తెలుగమ్మాయి తన మార్క్ సంస్కరణలు, ప్రయోగాలతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ‘‘ వరంగల్ యాసిడ్ దాడి ఘటన’’తో ఐపీఎస్ అవ్వాలని నిర్ణయించుకుని పట్టుదలతో ఐపీఎస్ అధికారిణి అయ్యింది.

మహిళలపై దాడులు తగ్గాలంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీసుకునే చర్యలతో పాటు పురుషుల్లోనూ పరివర్తన రావాలని దీప్తి భావన. అందుకు తగ్గట్టుగానే ఐపీఎస్ అధికారిణిగా తన పరిధిలో మహిళలకు న్యాయం జరిగేలా చూస్తున్నారు.. వారి భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ‘‘షీ భరోసా’’ లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు... ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

అలాగే పోలీస్ శాఖలో పనిచేసే మహిళా కానిస్టేబుళ్లను అధికారులు ఇతర సిబ్బంది గౌరవించేలా చూస్తున్నారు. ఒక అమ్మాయి బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ చందనకు అప్పగించారు.. ఆమె బాధ్యతను తనే తీసుకున్న దీప్తి ఉన్నత చదువులు చదివిస్తోంది. జిల్లా పోలీసులకు బాస్ అయినప్పటికీ... మెదక్ గల్లీల్లో సైకిల్ వేసుకుని తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.

తానొక అధికారిననే అహంకారం కనిపించనీయకుండా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రతివారం తనను కలుసుకోవడానికి వచ్చే వారిని ప్రేమగా పలకరించి వారి కష్టాలను ఒక కుటుంబసభ్యురాలిగా వింటారు. వినటమే కాకుండా సమస్యల పరిష్కారంలో అంతే శ్రద్ధ చూపిస్తారు.

కార్డెన్ సెర్చ్ అంటూ హడావిడి చేయకుండా దానిని ప్రజల దగ్గరకు వెళ్లే అరుదైన అవకాశంగా భావించి వారికి ఉపయోగపడే సూచనలు, సలహాలు అందజేస్తున్నారు దీప్తి.. అపరిచితులకు ఇల్లు అద్దెకు ఇవ్వద్దనడంతో పాటు అద్దెకు వచ్చే వారి నుంచి ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని సూచిస్తున్నారు చందన. చిల్లరగా తిరగకుండా ఉండాలని యువతలో స్ఫూర్తి నింపుతూనే వీలైతే ఉపాధి మార్గం కూడా చూపిస్తున్నారు చందన దీప్తి. 

చూడగానే నిండైన తెలుగుదనం... చందమామ లాంటి మోము.. బాణాల్లాంటి చూపులతో ప్రశాంతతకు చిరునామాగా కనిపిస్తారు దీప్తి.. ఆమె తండ్రి మైనింగ్ శాఖలో అధికారి.. అందువల్ల తరచుగా వరంగల్, కాకినాడ, నల్గొండ, చిత్తూరు ఇలా అనేక ప్రాంతాలకు బదిలీలు అవుతూ ఉండేవి. చిత్తూరు జిల్లాలో దీప్తి బాల్యం ఎక్కువగా గడిచింది. అక్కడి గుడ్ షెపర్డ్ హైస్కూల్‌ విద్యతో పాటు ఇంటర్మీడియట్ చదివారు.

ఐఐటీలో చేరాలన్నది ఆమె కల.. అందుకోసం రామయ్య ఇనిస్టిట్యూట్‌లో ప్రయత్నించినప్పటికీ సీటు దక్కలేదు.. అయినా పట్టుదలతో కోచింగ్ తీసుకుని ఐఐటీ సాధించారు. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌ చేస్తుండగా.. సివిల్ సర్వీసుల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్న చందన.. హైదరాబాద్ ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్‌లో చేరారు.. మొదటి ప్రయత్నం బెడిసికొట్టినప్పటికీ.. రెండో ప్రయత్నంలో ఐపీఎస్ ర్యాంక్ సాధించారు చందన.  

మహిళలపై దాడులు అరికట్టాలంటే ముందు పురుషుల్లో మార్పు రావాలి. మహిళలు తమ ఆత్మరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా వేధిస్తున్నారు అంటే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలి అంటున్నారు చందన దీప్తి. ఇలాంటి అధికారులకు సమాజం కాస్త తోడుగా నిలబడితే చాలు.. ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న యువ అధికారులకు ఈమె లాంటి కథలే మార్గదర్శకాలు అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

click me!