ఆ 25 స్థానాల్లో సీమాంధ్ర ఓటర్లే కీలకం: టీఆర్ఎస్‌ను ముంచుతారా తేల్చుతారా?

By narsimha lodeFirst Published Nov 11, 2018, 4:17 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  సెటిలర్ల ఓట్లు  గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. తెలంగాణలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు కోటి మంది ఓటర్లు ఉన్నారు.
 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  సెటిలర్ల ఓట్లు  గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. తెలంగాణలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు కోటి మంది ఓటర్లు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  గ్రేటర్ హైద్రాబాద్‌తో పాటు, నల్గొండ, మహాబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో సెటిలర్ల ఓట్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన సెటిలర్లు... ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు తెలంగాణలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయపడుతున్నారు.

దీంతో రాజకీయపార్టీలు అభ్యర్థుల ఎంపికలో సామాజికవర్గాన్ని కూడ దృష్టిలో పెట్టుకొంటున్నాయి. దీంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లను ప్రభావితం చేసేందుకు లేదా ఆ ఓటర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు గాను పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 

వచ్చే ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని ప్రచారం కూడ లేకపోలేదు. సెటిలర్లను అభివృద్ధి చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారి కంటే కూడ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లే కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారనే గుర్తింపు ఉంది.

సీమాంధ్ర ఓటర్లతో పాటు తమిళులు, కన్నడిగులు, కేరళవాసులు, మార్వాడీలు (గుజరాతీలు)  ఓటర్లు ఉన్నారు.గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారంగా సుమారు 58 శాతం సీమాంధ్ర ఓటర్లు ఉన్నారని తేలింది.

పాత జిల్లాల ప్రకారంగా రంగారెడ్డి, మెదక్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో సీమాంధ్ర జనాభా సుమారు 58 శాతానికి పైగా ఉంటుందని ఈ సర్వే తేల్చింది.గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని కూకట్ పల్లి, శేరి లింగంపల్లి, ఎల్బీనగర్, ముషీరాబాద్, పటాన్‌చెరువు, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల్లో సుమారు 58.5 శాతం జనాభా ఉంటుందని ఈ సర్వే నివేదిక ఆధారంగా తెలుస్తోంది.

ఈ నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో కాపు, బ్రహ్మణ సామాజిక వర్గాలు కూడ గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.


2014 ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సీమాంధ్ర ఓటర్లు టీడీపీ, బీజేపీ కూటమికి ఓటు వేశారు. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో టీడీపీ,బీజేపీ కూటమి ఎక్కువగా సీట్లు గెలవడంలో సీమాంధ్ర ఓటర్లు కీలక పాత్ర పోషించారు. 

ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు సీమాంధ్ర ఓటర్లను  ఆకట్టుకొనేందుకు కేసీఆర్ వరాలు ప్రకటించారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకొంటున్నాయి.

టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ పార్టీలు ప్రజా కూటమిగా ఏర్పడ్డాయి. దీంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు కూటమి వైపుకు మొగ్గు చూపుతారా... టీఆర్ఎస్ వైపుకు మొగ్గు చూపుతారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఈ ఎన్నికల్లో వచ్చే అవకాశాలు ఉండవనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అయితే గ్రేటర్ పరిధిలోని సుమారు 25 సెగ్మెంట్లలో సీమాంధ్ర ఓటర్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో సీట్లు కీలకంగా మారే అవకాశం లేకపోలేదు.

 

click me!