తెలంగాణ ఎన్నికలు: చారి ఓడి సెంటిమెంట్ గెలిచింది

By Nagaraju TFirst Published Dec 13, 2018, 12:19 PM IST
Highlights

రాజకీయాల్లో రెండు సెంటిమెంట్లు బలంగా ఉన్నాయి. అందులో ఒకటి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఆ తర్వాత ఎన్నికల్లో గెలవరని సెంటిమెంట్ ఉంటే హైదరాబాద్ అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేసిన వారు కూడా గెలవరని మరోసెంటిమెంట్ ఉంది. 
 

హైదరాబాద్: రాజకీయాల్లో రెండు సెంటిమెంట్లు బలంగా ఉన్నాయి. అందులో ఒకటి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఆ తర్వాత ఎన్నికల్లో గెలవరని సెంటిమెంట్ ఉంటే హైదరాబాద్ అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేసిన వారు కూడా గెలవరని మరోసెంటిమెంట్ ఉంది. 

అయితే ఈ సెంటిమెంట్ కొంతమంది నేతలకు పనిచేస్తే మరికొంతమందిని టచ్ చెయ్యలేకపోయింది. అయితే హైదరాబాద్ అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేసిన వాళ్లు ఆ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతారన్న సెంటిమెంట్ మాజీ స్పీకర్ మధుసూదనాచారి వ్యవహారంలో వర్క్ అవుట్ అయినట్లు ప్రచారం జరగుతుంది. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ వేవ్ నడిచినా కూడా ఆయన ఓటమి చెందడం ఈ సెంటిమెంట్ కారణమని ప్రచారం జోరుగా సాగుతోంది. 

వాస్తవానికి తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిది. కారు జోరుకు ప్రజాకూటమి కుదేలైంది. కాంగ్రెస్‌లోని సీఎం అభ్యర్థులంతా ఘోరంగా ఓడిపోయారు   ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మినహా. 

అయితే అంత టీఆర్ఎస్ జోరులోనూ నలుగురు మంత్రులు ఓటమిపాలయ్యారు. పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్ పరాజయం పాలయ్యారు. అటు మాజీ స్పీకర్ మధుసూదనాచారి సైతం ఓడిపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. 

తెలంగాణ తొలి స్పీకర్‌గా పనిచేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే హైదరాబాద్ లో స్పీకర్‌గా పనిచేసిన నేతలు గతంలో చాలా సార్లు ఓడిపోయారు. ఆ సెంటిమెంట్ మధుసూదనాచారికి తగిలిందని చెప్పుకొస్తున్నారు. 

ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డి.శ్రీపాదరావు స్పీకర్ గా పనిచేశారు. 1989 ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన టీడీపీ అభ్యర్థి బెల్లంకొండ సక్కుబాయిపై గెలుపొందారు. ఆ సమయంలో 1991లో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు.  

అయితే స్పీకర్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. 1994 ఎన్నికల్లో మంథనిలో టీడీపీ అభ్యర్థి చంద్రుపట్ల రాంరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి మహిళా స్పీకర్ గా పనిచేసిన నేత ప్రతిభా భారతి. 

1999 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోండ్రు మురళిపై ఆమె విజయం సాధించారు. 1999 నుంచి 2004 వరకు ఆమె స్పీకర్ గా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓటమి పాలయ్యారు. 2004లో ఎచ్చెర్ల నియోజకవర్గంలోనూ, 2009,2014లో రాజాం నియోజకవర్గంలోనూ ఓటమి పాలయ్యారు.  

ఇకపోతే  2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా సురేష్ రెడ్డి పనిచేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2004లో గెలుపొందారు. ఆ సమయంలో ఏపీ అసెంబ్లీకి 12వ శాసన సభ స్పీకర్ గా ఎంపికయ్యారు. 

నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన ఏకైక వ్యక్తిగా సురేష్ రెడ్డి రికార్డు సాధించారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1989 నుంచి 2004 వరకు నాలుగు సార్లు గెలిచిన ఆయన స్పీకర్ గా పనిచేసిన తర్వాత ఓటమి పాలయ్యారు. 

అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 13వ లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. 

ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. స్పీకర్ గా తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. రాజకీయాలకు దూరమయ్యారు. 

 కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా పదవీబాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆఖరి స్పీకర్ నాదెండ్ల మనోహర్ కావడం విశేషం. 2009 ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 

ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో ఆయన 2011లో స్పీకర్ గా పదవీబాధ్యతలు స్వీకరించారు. 2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఈయన జనసేనలో ఉన్నారు.
 
అయితే ఈ సెంటిమెంట్ మాత్రం ఏపీ ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విషయంలో వర్కవుట్ కాలేదు. 1995 నుంచి 1999 వరకు స్పీకర్‌గా పనిచేసిన యనమల ఆ తర్వాత వచ్చిన 2004 ఎన్నికల్లో గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన 2009 ఓటమి చెందగా, 2014 ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. 

ఇలా హైదరాబాద్ అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేసిన వారిలో కొంతమంది రాజకీయ భవిష్యత్ చీకటిమయం అయితే మరికొంతమంది విషయంలో అది వర్కవుట్ కాలేదు. మరుసటి ఏడాది పనిచెయ్యకపోయినా ఆ తర్వాతి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా అన్న సందేహం నెలకొంది. 

click me!