
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. తదితరులు స్వాగతం పలికారు. అయితే తనకు స్వాగతం పలికేందుకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మోదీ అభివాదం చేశారు.
అయితే తనకు స్వాగతం పలికేవారి వరుసలో ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వద్దకు చేరుకున్న సమయంలో ఆయనను మోదీ ప్రత్యేకంగా పలకరించారు. ఆ సమయంలో బండి సంజయ్ చేతులు జోడించి నమస్కారం తెలుపగా.. ప్రధాని మోదీ ఆయన చేతులను పట్టుకుని చిరునవ్వు చిందించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా నవ్వుతూ కనిపించారు. అయితే ఇటీవల బండి సంజయ్ అరెస్ట్ అంశం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
Also Read: ప్రధాని మోదీ పర్యటన.. నిశ్శబ్దంగా మంత్రి తలసాని నిరసన!.. వందే భారత్ రైలును ప్రారంభిస్తున్న సమయంలో..
ఇక, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి తెలంగాణ పర్యటనలకు వచ్చిన సందర్భంలో బండి సంజయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇంకా బలంగా పోరాడాలని కూడా సూచిస్తూ వచ్చారు. అయితే ఈసారి ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు ముందు.. టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ అరెస్ట్, మేజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు జూడీషియల్ రిమాండ్‌కు వెళ్లడం, ఆ తర్వాత బెయిల్ లభించడం వంటి పరిణామాలకు జరిగింది.
అయితే ఈ పరిణామాలపై బీజేపీ కేంద్ర అధినాయకత్వం దృష్టిసారించింది. బండి సంజయ్ అరెస్టుకు దారితీసిన పరిణామాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు వివరాలు సేకరించారు. బుధవారం నడ్డా బీజేపీ లీగల్ టీమ్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్‌రావుకు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అమిత్ షా ఫోన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనంతరం తెలంగాణలో పరిస్థితులు, బండి సంజయ్ అరెస్ట్ తదితర వివరాలను జేపీ నడ్డా, అమిత్ షాలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నివేదించారు.
Also Read: కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదు: కెసిఆర్ కు ప్రధాని మోడీ చురకలు
Also Read: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ.. వివరాలు ఇవే..
ఈ క్రమంలోనే హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. బండి సంజయ్ తనకు నమస్కారం పెట్టిన సమయంలో ఆయనకు ధైర్యం చెప్పేలా ప్రత్యేకంగా పలకిరించినట్టుగా తెలుస్తోంది.