తెలంగాణలో బస్ ఛార్జీల పెంపు... ఆర్టీసీ అధికారులకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్..?

By Siva KodatiFirst Published Sep 21, 2021, 9:16 PM IST
Highlights

టీఎస్ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఛార్జీలను పెంచాలని సర్కార్ యోచిస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి వుంది. 

టీఎస్ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఛార్జీలను పెంచాలని సర్కార్ యోచిస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి వుంది. 

మరోవైపు ఆర్టీసీ పరిస్ధితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై కరోనా, పెరిగిన డీజిల్‌ రేట్ల భారం నేపథ్యంలో.. తిరిగి పుంజుకునేందుకు అవలంభించాల్సిన విధివిధానాలపై సీఎం సమీక్ష చేపట్టారు. సమావేశంలో ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, సైదిరెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నర్సింగరావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, ఫైనాన్స్ సెక్రెటరీ రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.

గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న టీఎస్‌ ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించింది. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే ఆర్టీసీ ఛైర్మన్‌గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను తెలంగాణ సర్కార్‌ నియమించింది. ఇప్పటికే ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్.. పలు అంశాలపై దృష్టి సారించి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. 

click me!