జబ్బు తగ్గిస్తానని ఏవో పూజలు: మరింత ముదిరిన రోగం, బాధితుడు మృతి

By Siva KodatiFirst Published Aug 25, 2020, 5:26 PM IST
Highlights

మంత్రాలతో రోగం మాయం చేస్తానంటూ చెప్పి ఓ మంత్రగాడు నిండి ప్రాణం బలి తీసుకున్నాడు.

భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా ఇంకా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. విదేశీయులు సైతం వైద్యం కోసం మనదేశానికి పరిగెత్తుకొస్తుంటే.. కొందరు మాత్రం ఇంకా బాబాలు, స్వామిజీలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

తాజాగా మంత్రాలతో రోగం మాయం చేస్తానంటూ చెప్పి ఓ మంత్రగాడు నిండి ప్రాణం బలి తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి- భువనగిరి జిల్లా వెలిగొండ గ్రామానికి చెందిన మహేశ్.. దినసరి  కూలీగా జీవనం సాగిస్తున్నాడు.

అయితే  గత కొలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండటంతో ఎన్ని  ఆసుపత్రులు తిరిగినా నయం కాలేదు. దీంతో బంధువుల సలహా మేరకు నంది వనపర్తిలో శ్రీహరి అనే మంత్రగాడి దగ్గరకు ఈ నెల 24న వెళ్లారు.

తాను మంత్రాలు వేసి పటం గీసి బాగు చేస్తానంటూ శ్రీహరి రూ.20 వేలు వసూలు చేశాడు. అయితే మహేశ్ రూ.10 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఈ క్రమంలో శ్రీహరి ఇంటి దగ్గరే మంత్రాల సామాగ్రితో కొన్ని కార్యక్రమాలు చేశాడని బంధువులు వెల్లడించారు.

వ్యాధి తగ్గకపోగా మరింత ముదిరి ఆరోగ్యం క్షీణించడంతో మహేశ్ నంది వనపర్తి గ్రామంలోనే ప్రాణాలు విడిచాడు. జబ్బు  నయం చేస్తానని నమ్మించి ప్రాణాలు తీసిన శ్రీహరిపై చర్యలు  తీసుకోవాలని మహేశ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడు నెలల క్రితం మహేశ్‌కు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి.
 

click me!