లైన్ క్లియర్: తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు ప్లాన్ రెడీ

By telugu teamFirst Published Jun 30, 2020, 8:46 AM IST
Highlights

హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక ఇప్పటికే సిద్దమైనట్లు సమాచారం.

హైదరాబాద్: కోర్టు ఆటంకాలు తొలగిపోవడంతో పాత సచివాలయ భవన సముదాయాల కూల్చివేత ప్రక్రియ వేగవంతమవుతోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను ఆర్ అండ్ బీ శాఖ ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో ప్రగతి భవన్లో  జరిగే సమావేశంలో కూల్చివేతలు మొదలుపెట్టే తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

కూల్చివేత కోసం రెండుమూడు అత్యుత్తమమైన ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్త భవనం కోసం 10 కంపెనీలు నమూనాలను, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లను ప్రభుత్వానికి సమర్పించాయి. శ్రావణమాసంలో కొత్త భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.వారం రోజుల్లో పాత సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

కూల్చివేతకు అవసరమయ్యే రైట్ ఆఫ్ కోసం పంపాల్సిన ప్రతిపాదనను ఆర్ అండ్ బీ సిద్ధంచేస్తోంది. నేడో రేపో ఆర్థికశాఖ నుంచి రైట్ ఆఫ్ క్లియరెన్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఆ తరవాత రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నుంచి అనుమతి తీసుకొని ప్రభుత్వం టెండర్లకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే క్యాబినెట్ నిర్ణయం జరిగిపోయిన నేపథ్యంలో మిగిలిన ప్రక్రియంతా ఇక లాంఛనమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే పాత భవనాలను కూల్చే సమయంలో చుట్టుపక్కల ఉన్న భవనాలకు, ప్రజాజీవనానికి, రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి సూచనల మేరకు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోనున్నారు. కూల్చివేతలు జరిగేటప్పుడు శిథిలాలు సముదాయం చుట్టూ ఉన్న ప్రాంతాలకు ఎగిరిపడకుండా ఆధునిక పద్ధతులను  అనుసరించనున్నారు. పనులు జరిగే ప్రాంతం చుట్టూ బ్లూషీట్స్ తో పెద్ద కంచె ఏర్పాటు చేయనున్నారు. 

నిర్మాణానికి అనుగుణంగా దశలవారీగా భవనాల కూల్చివేత ఉండనున్నట్లు తెలుస్తోంది. ముందుగా డోర్లు, డోర్ ఫ్రేములు, కిటికీలలాంటి ఉపకరణాలను, ఇతర ఫర్నిచర్ ను భవనాల నుంచి వేరు చేస్తారు. స్లాబులు, గోడలను బ్లాకుల వారిగా విభజించి సౌండ్ ప్రూఫ్ టెక్నాలజీతో కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తారుకొత్త భవన నిర్మాణాన్ని సైతం మంత్రిత్వశాఖల వారిగా ప్రత్యేక బ్లాకులతో, ఓ పథకం ప్రకారం, ప్రణాళికాబద్ధంగా, వాస్తు పద్ధతులకు అనుగుణంగా చేపడతారు. 

అన్ని ఆధునిక హంగులతో నిర్మించబోయే కొత్త సచివాలయం కోసం సుమారు రూ. లు 400 ల కోట్ల నుంచి రూ. లు 500 ల కోట్ల మేరకు ఖర్చవుతాయని అంచనా. ఈ మొత్తానికి బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్ జారీ చేసేందుకు కూడా ఆర్ అండ్ బీ విభాగం త్వరలో ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపనుంది. కొత్త భవనం కోసం 10 కంపెనీలు నమూనాలను, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లను ప్రభుత్వానికి సమర్పించాయి. వీటిలో ఒకదానిని ముఖ్యమంత్రి ఖరారు చేయాల్సి ఉంది. ఆ తరవాత జూలై నెలాఖరున అంటే శ్రావణమాసంలో కొత్త భవన నిర్మాణం పనులు మొదలయ్యే అవకాశాలున్నాయి.

పాత సచివాలయం వివరాలు ఓసారి చూస్తే ఏ బ్లాక్ భవన సముదాయాన్ని 1981 లో అప్పటి ముఖ్యమంత్రి టీ. అంజయ్య ప్రారంభించారు. సీ బ్లాక్ ను 1978 లో ఆనాటి సీఎం చెన్నారెడ్డి ప్రారంభించారు. ఇందులో మొత్తం 6 అంతస్తులున్నాయి. దీంట్లోనే ముఖ్యమంత్రులు కొలువుదీరేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రగతి భవన్ ను నిర్మించి అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

ఏ బ్లాక్ ఫేజ్ 2 ను 1998 ఆగస్టు 10 వ తేదీన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. మరోవైపు డి బ్లాక్ కు కూడా 2003 లో చంద్రబాబునాయుడే శంకుస్థాపన చేయగా, 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక దాన్ని ప్రారంభించారు. 

ఇటీవలి దాకా ఏపీ అధీనంలో ఉన్న జె, ఎల్ బ్లాక్ లను అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 1990 నవంబర్ 12 న ప్రారంభిచారు. జె బ్లాక్ సచివాలయంలోని అతిపెద్ద బ్లాక్ . ప్రస్తుత సచివాలయం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అన్ని భవనాలు కలిపి 9 లక్షల 16 వేల 653 చదరపు అడుగుల్లో వివిధ శాఖలు, విభాగాలు విస్తరించి ఉన్నాయి.

click me!