కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్‌.. పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా

Published : Aug 14, 2026, 04:54 PM IST
Telangana Cabinet

సారాంశం

Telangana Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్ర‌ధానంగా 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0' నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

డిసెంబర్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0

రాష్ట్రంలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించే లక్ష్యంతో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. గత ఏడాది నిర్వహించిన సదస్సు కంటే ఈసారి మరింత విస్తృత స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమ్మిట్‌లో దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ ప్రతినిధులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. తెలంగాణను పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

'ఇన్వెస్ట్ తెలంగాణ' థీమ్‌తో భారీ కార్యక్రమం

ఈసారి గ్లోబల్ సమ్మిట్‌ను 'ఇన్వెస్ట్ తెలంగాణ' అనే ప్రధాన థీమ్‌తో నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, అధునాతన తయారీ పరిశ్రమలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారులకు వివరించనున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ గురించి కూడా ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనుంది. రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతమైన పరిశ్రమలు, స్టార్టప్‌లు సాధించిన విజయాలను ప్రదర్శించే ఎగ్జిబిషన్‌తో పాటు కొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

సమ్మిట్ నిర్వహణకు భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీ

గ్లోబల్ సమ్మిట్‌ను సమర్థతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి సభ్యులుగా ఉండనున్నారు. సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లు, పెట్టుబడిదారుల ఆహ్వానం, ప్రదర్శనల నిర్వహణ, అంతర్జాతీయ భాగస్వామ్య కార్యక్రమాల సమన్వయ బాధ్యతలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.

రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం కీలక ప్రకటన

కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఆయా మంత్రులు లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేస్తారని చెప్పారు. గతంలో రాష్ట్రంలో సుమారు 2.81 కోట్ల మంది రేషన్ కార్డుల పరిధిలో ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 62 లక్షల మంది కొత్తగా చేర్చిన‌ట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3.42 కోట్ల మంది రేషన్ కార్డుల ద్వారా ప్రయోజనం పొందుతున్నారని వివరించారు.

రైతులకు బోనస్.. ధాన్యం కొనుగోళ్లపై కీలక నిర్ణయాలు

వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఏడు సన్న వడ్ల రకాల ధాన్యం పండించే రైతులకు కనీస మద్ధతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే గత యాసంగి సీజన్‌లో ప్రభుత్వం 81.16 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, అందులో 63.62 లక్షల టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. మిగిలిన 17.54 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాల ద్వారా పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామికాభివృద్ధి, రైతు సంక్షేమం, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై ప్రభుత్వం ఒకేసారి దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nalsar : హైదరాబాద్ లో ఈ గోలేంటి? దీంతో కాక్రోచ్ లకు సంబంధమేంటి?
Weather Update: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు