
తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన రాజకీయ వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా ఆగస్టు 19న వరంగల్ జిల్లా గీసుకొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పరకాల రాజకీయాలపై మాట్లాడిన సుస్మిత.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని స్పష్టం చేయడంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం, అధికార పార్టీ ఎమ్మెల్యేపై బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ దృష్టి సారించింది. దీంతో మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరింది.
గీసుకొండలో జరిగిన కార్యక్రమంలో సుస్మితా పటేల్.. పరకాల నియోజకవర్గాన్ని తమ కుటుంబ రాజకీయ అడ్డాగా అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని చెప్పారు. ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి.. రేవూరి ప్రకాశ్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరడాన్ని ఆమె ప్రశ్నించారు. ఒక నియోజకవర్గంలో అధిష్ఠానం అవకాశం ఇస్తుందని చెబుతూ, పరకాలలో మాత్రం ముందుగానే మరో అభ్యర్థికి మద్ధతు ప్రకటించడం తమను ఇబ్బంది పెట్టే చర్యగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కొండా మురళి గతంలో రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి మద్ధతు ఇచ్చారని, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చి తర్వాత పట్టించుకోలేదని సుస్మిత ఆరోపించారు. పరకాలలో రేవూరి గెలుపు వెనుక తమ కుటుంబం చేసిన రాజకీయ కృషిని గుర్తించాలని అన్నారు.
సీఎం సోదరుడికి సంబంధించిన ఓ కంపెనీకి భూమి కేటాయింపుపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. తన వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగితే సీఎం కుటుంబానికి సంబంధించిన అవినీతి అంశాలను బయటపెడతానని హెచ్చరించారు. బీసీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపైనా విమర్శలు చేశారు. రేవూరిని రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించాలని, ఆ ఎన్నికలో తాను బరిలోకి దిగుతానని సుస్మిత పేర్కొన్నారు.
సుస్మిత చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నవిగా పార్టీ వర్గాల్లో చర్చకు వచ్చాయి. సుస్మిత కాంగ్రెస్ పార్టీకి అధికారిక సభ్యురాలు కాదని కొందరు నేతలు చెబుతున్నప్పటికీ, ఆమె మంత్రి కొండా సురేఖ కుమార్తె కావడంతో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ.. మంత్రి సురేఖను వివరణ కోరింది. పార్టీ నాయకత్వంపై, పార్టీ నిర్ణయాలపై బహిరంగంగా వచ్చిన విమర్శలకు సంబంధించి ఆమె వైఖరిని తెలుసుకోవడమే నోటీసు ఉద్దేశంగా కనిపించింది. అయితే తనకు సంబంధం లేని వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని సురేఖ తాజాగా స్పష్టం చేశారు.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి మంత్రి కొండా సురేఖ ఆగస్టు 20న లేఖ ద్వారా తన వివరణ పంపించారు. గీసుకొండలో జరిగిన కార్యక్రమం తన జన్మదిన వేడుకల్లో భాగంగానే నిర్వహించారని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు చేపట్టారని వివరించారు. గీసుకొండతో తన కుమార్తె సుస్మితకు ప్రత్యేక అనుబంధం ఉన్నందున అక్కడి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారని సురేఖ పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని స్పష్టం చేశారు. వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.
కుటుంబ సంబంధం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయాలకు మరో వ్యక్తి రాజకీయంగా బాధ్యత వహించాల్సిన అవసరం లేదని సురేఖ తన లేఖలో పేర్కొన్నారు. తన ప్రమేయం లేని వ్యాఖ్యలపై వివరణ కోరడం సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా లేదని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత అభిప్రాయాలను రాజకీయ బాధ్యతతో ముడిపెట్టడం సముచితం కాదని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, క్రమశిక్షణా వ్యవస్థపై తనకు పూర్తి గౌరవం ఉందని కొండా సురేఖ స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలు, క్రమశిక్షణ, ప్రజాస్వామ్య విలువలకు తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. క్రమశిక్షణా కమిటీ తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తానని పేర్కొంటూనే, ఈ కేసులో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తనకు సంబంధం లేని అంశంపై జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని మల్లు రవికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు సురేఖ ఇచ్చిన వివరణపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కూడా స్పందిస్తున్నారు. సుస్మితకు కాంగ్రెస్‌లో సభ్యత్వం లేదని, సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యాఖ్యలు చేసే స్థాయి ఆమెది కాదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాత్రం ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని, సరైన సమయంలో స్పందిస్తామని చెప్పారు. దీంతో కొండా కుటుంబం, రేవంత్ వర్గాల మధ్య నెలకొన్న ఈ రాజకీయ వివాదం పార్టీ అంతర్గతంగా ఎటువైపు వెళ్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.