హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పురోగతి సాధించాం.. సీపీ సీవీ ఆనంద్

By Sumanth KanukulaFirst Published Jan 27, 2022, 3:44 PM IST
Highlights

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో (Hyderabad Druga Case) పురోగతి సాధించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) తెలిపారు. నిందితులని మరోసారి కస్టడీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు.


హైదరాబాద్ డ్రగ్స్ కేసులో (Hyderabad Druga Case) పురోగతి సాధించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) తెలిపారు. నిందితులని మరోసారి కస్టడీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు.  ప్రధాన నిందితుడు టోనీకి సంబంధించి రెండు సెల్‌ఫోన్‌లు సీజ్ చేసినట్టుగా ఆయన తెలిపారు. నిందితుల సెల్‌ఫోన్ డేటాను అనాలసిస్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. విచారణ కొనసాగుతుందని.. దొరికే సమాచారం ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా, వినియోగం కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు.. వారం రోజుల కిందట పలు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న టోనీనీ  ముంబైలో అరెస్ట్ చేశారు. అంతకుముందు టోనీ ముఠా సభ్యులను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి కాల్ లిస్ట్ ఆధారంగా టోనీ ఆచూకీని గుర్తించారు. ఇక, 2013లో తాత్కాలిక వీసాపై ముంబైకి వచ్చిన టోనీ.. వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటున్నాడు. ముంబై కేంద్రంగా పలు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. టోనీతో పాటు హైదరాబాద్‌లో అతని వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక, డ్రగ్స్ కేసులో (drugs case) మరో 15 మంది వ్యాపారవేత్తలను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు వ్యాపారవేత్తలు గజేంద్ర, విపుల్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు (task force police) గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో  గజేంద్ర, విపుల్ ప్రస్తుతం బడా పారిశ్రామికవేత్తలుగా కొనసాగుతున్నారు. వీరు టోనీ దగ్గరి నుంచి కొన్నేళ్లుగా డ్రగ్స్‌ను తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో రూ.500 కోట్ల పైచిలుకు వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో 15 మందికి టోనీ డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉండే చాన్స్ ఉందని అనుమానిస్తున్నారు. 

టోనీ లావాదేవీలు అన్ని డార్క్ వెబ్ సైట్ ద్వారా నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా సెల్ ఫోన్‌లో ఉన్న డాటాను, వాట్సాప్ చాటింగ్‌లను టోనీ ఎప్పటికప్పుడు డిలీట్ చేసేవాడని కనుగొన్నారు. టోనీకి సంబంధించిన రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అందులో నుంచి డాటాను, వాట్సాప్ చాటింగ్‌ను రికవరీ చేశారు.
 

click me!