హైదరాబాద్ లో కుండపోత... చెరువుల్లా మారిన రోడ్లు, కొట్టుకుపోయిన వాహనాలు (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 3, 2021, 9:38 AM IST
Highlights

గురువారం రాత్రి ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణికిపోయింది. రోడ్లపైకి వర్షపు నీరు చేరి చెరువులను తలపించాయి. 

హైదరాబాద్: గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ జలమయమయ్యింది. ఏకదాటిగా దాదాపు మూడుగంటల పాటు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం కురిసింది. దీంతో నాలాలు పొంగిపోర్లి రోడ్లన్ని చెరువుల్లా మారాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లో అయితే రోడ్డుపైనే వరదనీరు ఉద్రుతంగా ప్రవహించడంతో వాహనాలు, రోడ్డుపక్కనుండే పండ్లు, కురగాయల బండ్లు కొట్టుకుపోయాయి.  

ముఖ్యంగా యూసుఫ్ గూడ, క్రిష్ణానగర్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో వరద నీరు రోడ్లపై ప్రమాదకర రీతిలో ప్రవహించింది. నడుములోతు నీటిలో ఇంటికి చేరుకోడానికి ప్రజలు ఇబ్బందులుపడ్డారు. ఓ వ్యక్తి ఈ నీటిలో కొట్టుకుపోతుండగా స్థానికులు అతడిని కాపాడారు. హైదరాబాద్ నడిబొడ్డున వర్షపునీటిలో ఓ వ్యక్తి కొట్టుకుపొయేవాడంటే ఏ స్థాయిలో వర్షం కురిసిందో అర్థం చేసుకోవచ్చు. 

వీడియో

 నగరంలో కుండపోత వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు చేరడంతో  ప్రజలు అప్రమత్తంగా వుండాలని జీహెచ్ఎంసి అధికారులు సూచించారు. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో సహాయక చర్యలు చేపట్టింది. ప్రజలు జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లాలని గురువారం రాత్రి అధికారులు ఓ ప్రకటన చేశారు. అత్యవసరమైతే 040-29555500 నంబర్ కు కాల్ చేయాలని జీహెచ్ఎంసి అధికారులు సూచించారు.

భారీ వర్షంతో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాలు ముందుకుకదిలే పరిస్థితి లేక ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షంతో పాటు ఈదురుగాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో తీగలు తెగిపడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  

click me!