రాజీనామాకు ఉత్తమ్ రెడీ; తెలంగాణ పిసిసి రేసులో రేవంత్ రెడ్డి

By Nagaraju penumalaFirst Published Oct 25, 2019, 12:25 PM IST
Highlights

అధిష్టానం ఆమోదించినా, ఆమోదించకపోయినా పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసైడ్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రేసులో ముందువరుసలో ఉన్నారు. 

న్యూఢిల్లీ: హుజూర్ నగర్ ఉపఎన్నికల ఫలితం నేపథ్యంలో హస్తినబాట పట్టారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి నివేదిక ఇవ్వననున్నట్లు తెలుస్తోంది. 

ఉపఎన్నికల ఫలితాలు, రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గతకుమ్ములాటలపై సోనియాగాంధీతో చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొననున్న ఉత్తమ్ అంతకంటే ముందే సోనియాతో భేటీ కానున్నారని తెలుస్తోంది. 

కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై ఉత్తమ్ తోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా జీర్ణించుకోలేకపోతుంది.  

నియోజకవర్గం మొదటి నుంచి కంచుకోటగా ఉండటం, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటా ప్రచారం చేసినా ప్రజలు ఆదరించకపోవడంపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుంది. 

టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవన్నీ పనిచేయకపోవడంపై కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. సమ్మె తీవ్ర ప్రభావం చూపుతుందని భావించినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేదు. 

అంతేకాదు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరిట ఉన్న రికార్డును సైతం సైదిరెడ్డి అధిగమించారు. 43,539 ఓట్ల మెజారిటీతో రికార్డు స్థాయిలో గెలుపొందారు సైదిరెడ్డి. 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పీసీసీచీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి కేవలం 69,7736 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. పీసీసీ చీఫ్ గా ఉండి అందులోనూ సొంత నియోజకవర్గంలో భార్యను గెలిపించుకోకపోవడంపై రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మండలాలైన మేళ్లచెరువు, మఠంపల్లి, నెరేడుచర్ల, పాలకీడు వంటి మండలాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కనబరచడంపై కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది.  

ఇకపోతే హుజూర్‌నగర్‌ ఉపఎన్నికను ఆద్యంతం దగ్గరుండి పర్యవేక్షించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉపఎన్నికలో ఏం జరిగినా పూర్తి బాధ్యత తనదేని ప్రకటించారు కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో హుజూర్ నగర్ ఉపఎన్నిక ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.  

అధిష్టానం ఆమోదించినా, ఆమోదించకపోయినా పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసైడ్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. 

 

 

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రేసులో ముందువరుసలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో ఓటమి పాలైనప్పటికీ అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ పదవిపై రేవంత్ కన్నేసినట్లు సమాచారం. 

ఇకపోతే తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ కన్నేసింది. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో వ్యూహరచన చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి అయితే బెటర్ అని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఇటీవల నిర్వహించిన ప్రగతిభవన్ ముట్టడిలో రేవంత్ రెడ్డి దూకుడుగానే వ్యవహరించారు. పోలీసులు పన్నిన పద్మవ్యూహాన్ని దాటుకుని మరీ వెళ్లి ప్రగతిభవన్ ను ముట్టడించారు. అయితే ఈ అంశం కాంగ్రెస్ పార్టీలో వివాదంగా మారిన సంగతి తెలిసిందే. 

ఉత్తమ్ తప్పుకుంటే టీ పీసీసీ చీఫ్ పోస్టు దక్కించుకోవాలని ఎప్పటి నుంచో కాచుకు కూర్చున్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ముందస్తు ఎన్నికల అప్పటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలంటూ ఆయన పట్టుబడుతున్నారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాలను మారిస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉంటుందని కోమటిరెడ్డి బ్రదర్స్ అప్పట్లో సూచించిన సంగతి తెలిసిందే. అంతేకాదు సార్వత్రిక ఎన్నికల బాధ్యతను తమకు అప్పగిస్తే ఏడు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని కూడా ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్నకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే ఆయన సైలెంట్ అవుతారని ప్రచారం. 

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన వి.హన్మంతరావు సైతం పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. బీసీలు పీసీసీ చీఫ్ పదవి చేపట్ట కూడదా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి బీసీలకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలంటూ గతంలో వీహెచ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 

మెుత్తానికి పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతానికి రాజీనామా చేయకపోయినప్పటికీ ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం జరగడంతో పీసీసీ చీఫ్ పోస్టు కోసం రేసు మెుదలైంది. ఇప్పటికే కొందరు ఆశావాహులు ఢిల్లీలోనే మకాం వేసి తమకున్న పరిచయాలతో పీసీసీ చీఫ్ పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. 

ఈ వార్తలు కూడా చదవండి

హుజూర్‌నగర్‌లో ఓటమి ఎఫెక్ట్: ఉత్తమ్‌ను పీసీసీ చీఫ్ నుండి తప్పిస్తారా?

ఈసారి ఓటెయ్యనివారు వచ్చే ఎన్నికల్లో ఓటేసేలా పనిచేస్తా: ఎమ్మెల్యే సైదిరెడ్డి

ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారు: టీఆర్ఎస్ పై ఉత్తమ్ పద్మావతి సంచలన వ్యాఖ్యలు

ఉత్తమ్‌కు సై, పద్మావతికి నై, అదే సైదిరెడ్డి విజయం :హుజూర్‌నగర్ ఓటింగ్ సరళి ఇదీ

click me!